TSRTC బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే బిల్లుకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు.
By Srikanth Gundamalla Published on 14 Sep 2023 6:43 AM GMTTSRTC బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే బిల్లుకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. ఆమె చేసిన 10 సిఫారసుల విషయంలో ప్రభుత్వం స్పందన సంతృప్తిగా ఉందని తెలిపారు. దాంతో.. గవర్నర్ తాజాగా ఆర్టీసీ విలీనం బిల్లుని ఆమోదిస్తూ సంతకం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ఆర్టీసీ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలో అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. ఆ బిల్లు పత్రాలను గవర్నర్‌కు ప్రభుత్వం పంపగా.. ఆమె కొన్ని అంశాలపై వివరణ అడిగారు. అంతేకాకుండా 10 సిఫారసులు కూడా చేశారు. ప్రభుత్వం వాటన్నింటిపై పూర్తిగా వివరణ ఇవ్వడంతో కొన్ని వారాల తర్వాత గవర్నర్ తమిళిసై బిల్లుకు ఆమోదం తెలిపారు.
ప్రజా రవాణా వ్యవస్థన మరింత పటిష్టం చేయడానికి, ఆర్టీసీ సేవలను ఇంకా విస్తృతం చేసేందుకు తెలంగాణ కేబినెట్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కేబినెట్ నిర్ణయించింది. అసెంబ్లీలో కూడా బిల్లును ప్రవేశపెట్టారు. ఆర్థిక అంశాలకు సంబంధించిన బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం కోసం పంపింది ప్రభుత్వం. అయితే.. కొంత సమయం తీసుకున్నా.. ప్రభుత్వం అన్ని రకాలుగా వివరణ ఇవ్వడంతో గవర్నర్ తాజాగా బిల్లుకు ఆమోదం తెలిపారు. ఆర్టీసీ కార్మికులు గతంలో సమ్మె చేసిన అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని సానుకూలంగా స్పందించారు గవర్నర్. తాజాగా ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో.. టీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న మొత్తం 43,373 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.