గ్రూప్-2 అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక సూచనలు జారీ చేసింది. గ్రూప్-2 పరీక్షకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులు.. తమ దరఖాస్తుల్లో తప్పులు సవరణ చేసుకునేందుకు ఛాన్స్ కల్పించింది. జులై 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో ఎడి ఆప్షన్ అందుబాటులో ఉంటుందని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. ఆధార్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను మార్చుకునేందుకు తగిన ప్రూఫ్ సమర్పించాలని కమిషన్ స్పష్టం చేసింది. దీని తర్వాత సవరణలకు మరో అవకాశం ఉండదని తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. 5,51,901 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు.
గ్రూప్-2 నియామకాల కోసం ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వాహణకు టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 600 మార్కులకు నాలుగు పేపర్లలో ఆబ్జెక్టివ్ విధానంలో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-2 పరీక్షలో మొదటి పేపర్‌లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీస్, రెండో పేపరులో హిస్టరీ, పాలిటీ, సొసైటీ సబ్జెక్ట్లు, మూడో పేపర్‌లో ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్, నాలుగో పేపర్‌లో తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ నెల 14న జరగనున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామక పరీక్ష హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ రిలీజ్ చేసింది. టీఎస్‌పీఎస్సీ పోటీ పరీక్షల నిర్వహణలో భారీ మార్పులకు సైతం ప్లాన్ చేసింది.