TSPSC చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి ఖరారు.. గవర్నర్ ఆమోదం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కొత్త చైర్మన్ కోసం దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించింది.
By Srikanth Gundamalla
TSPSC చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి ఖరారు.. గవర్నర్ ఆమోదం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కొత్త చైర్మన్ కోసం దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించింది. ఇందుకు గాను చాలామంది ఉన్నతాధికారులు ఈ పోస్టు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కాగా.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ఎం.మహేందర్‌రెడ్డి నియామకం ఖరారైంది. మాజీ డీజీపీగా గతంలో ఆయన పనిచేసిన విషయం తెలిసిందే. ఆయన్ని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమించడానికి గవర్నర్ తమిళిసై కూడా ఆమోదం తెలుపుతూ గురువారం నిర్ణయం తీసుకున్నారు.
టీఎస్‌పీఎస్సీలో చైర్మన్‌తో పాటు కొంతమంది సభ్యుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌తో పాటు పలువురు సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవి కోసం మొత్తం 370 వరకు దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించింది. దరఖాస్తుల పరిశీలన, అవార్డులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తులను పరిశీలన చేసింది. ఇక చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో నుంచి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇక ప్రభుత్వం ఆయన పేరును గవర్నర్ పరిశీలనకు పంపింది. చివరకు గవర్నర్ కూడా టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి నియామకానికి ఆమోదం తెలిపారు.
తెలంగాణ డీజీపీగా ఎం. మహేందర్‌రెడ్డి పని చేశారు. ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా మధిర మండలంలోని కిష్టాపురం. ఆయన 1968 బ్యాచ్ పోలీస్ సర్వీసు అధికారు. ఏఎస్పీగా మొదట ఆయన కెరియర్ ప్రారంభం అయ్యింది. డీజీపీ వరకు ఎదిగి ఆ తర్వాత పదవీ విరమణ పొందారు. డీజీపీ అనురాగ్‌శర్మ పదవీ విరమణ తర్వాత 2017లో నవంబర్ 17న ఇంచార్జ్ డీజీపీగా బాధ్యతలు తీసకుని.. 2018 ఏప్రిల్ 10న పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించారు. ఇక 2022 డిసెంబర్‌లో మహేందర్‌రెడ్డి డీజీపీగా పదవీ విరమణ పొందారు. మూడేళ్లకు పైగా ఆయన రాష్ట్ర డీజీపీగా కొనసాగారు. శాంతిభద్రతలను కాపాడటంలో కీలకపాత్ర పోషించారు. కాగా.. మహేందర్‌రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియామకం అయితే ఈ ఏడాది డిసెంబర్ వరకే కొనసాగే అవకాశం ఉంది. కమిషన్ నిబంధనల ప్రకారం 62 ఏళ్లు దాటితే వారు పదవీవిరమణ చేయాల్సి ఉంటుంది.