టీఎస్‌పీఎస్‌సీ ఎదుట గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన
టీఎస్పీఎస్సీ (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) కార్యాలయం దగ్గర గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళనకు చేపట్టారు.
By అంజి Published on 10 Aug 2023 7:30 AM GMTటీఎస్‌పీఎస్‌సీ ఎదుట గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) కార్యాలయం దగ్గర గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళనకు చేపట్టారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ.. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో హైదరాబాద్‌లోని ఆఫీస్ వద్దకు భారీగా అభ్యర్థులు తరలివచ్చారు. పరీక్షను వాయిదా వేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. నాంపల్లిలోని తెలంగాణ జన సమితి కార్యాలయం నుంచి సుమారు 2 వేల మంది అభ్యర్థులు పెద్ద ఎత్తున ర్యాలీగా బయల్దేరి వచ్చారు. ముట్టడించేందుకు ప్రయత్నించిన అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. అభ్యర్థుల నినాదాలతో టీఎస్‌పీఎస్‌సీ పరిసర ప్రాంతాలు మార్మోగాయి.
గ్రూప్ - 2 అభ్యర్థుల నిరసనకు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ఫ్రొ. కోదండరామ్ మద్ధతు తెలిపారు. అభ్యర్థుల నిరసన నేపథ్యంలో టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. అటు కార్యాలయం సమీపంలో అభ్యర్థులు బైఠాయించి ధర్నా చేపట్టారు. గ్రూప్ -2 పరీక్షకు ఆగస్టు 29, 30 తేదీలను టీఎస్‌పీఎస్‌సీ ఖరారు చేయగా, ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల బోర్డు పరీక్షలు ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. ఇలా ఒకే నెలలో వేర్వేరు సిలబస్‌లు ఉండటంతో రెండు పరీక్షలకు సన్నద్ధం కావడం కష్టంగా మారిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని కారణంగా తమకు అర్హతా ఉన్నా ఎదో ఒక పరీక్షకు మాత్రమే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఇప్పటికే పేపర్ లీకేజీతో 3 నెలలు మానసికంగా కుంగిపోయామని, అంతే కాకుండా గ్రూప్-2 మూడో పేపర్ ఎకానమీలోని గతంలోని సిలబస్‌కు 70 శాతం కలిపారని పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్‌సీ తమ సమస్యను అర్ధం చేసుకుని వెసులుబాటు కల్పించాలని అభ్యర్థులు కోరుతున్నారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని ప్రొ.కోదండరామ్ కోరారు. పరీక్షలకు చదువుకునేందుకు అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. ఏడేళ్లు ఆగిన ప్రభుత్వం.. పరీక్షకు మరో 3 నెలలు ఆగలేదా? అంటూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. అభ్యర్థుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. అరెస్ట్ చేసిన అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.