విద్యార్థుల సర్టిఫికెట్లలో స్మార్ట్ చిప్‌లు.. టీఎస్‌సీహెచ్‌ఈ యోచన
TSCHE to embed smart chips into certificates. హైదరాబాద్: నకిలీ సర్టిఫికెట్ల వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.
By అంజి Published on 21 Nov 2022 6:07 AM GMTహైదరాబాద్: నకిలీ సర్టిఫికెట్ల వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. నకిలీ సర్టిఫికెట్ల బెడద పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎస్‌సీహెచ్‌ఈ), రాష్ట్ర విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు జారీ చేసే సర్టిఫికెట్లలో స్మార్ట్ చిప్‌లను పొందుపరచాలని యోచిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అనేక నకిలీ సర్టిఫికెట్లు వెలుగులోకి రావడంతో స్మార్ట్ చిప్‌ల ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రత్యేకమైన కోడ్ నంబర్లు, లోగోలు, వాటర్‌మార్క్‌లు, పేపర్ మందం వంటి ఫీచర్‌లు ఉన్నప్పటికీ కొంతమంది కేటుగాళ్లు నకిలీ సర్టిఫికేట్లను సృష్టిస్తున్నారు. దీనిని పరిష్కరించడానికి.. టీఎస్‌సీహెచ్‌ఈ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు రెండూ డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ల విద్యార్థుల అకడమిక్ వివరాలను స్మార్ట్ చిప్‌లలో చేర్చడానికి సిద్ధమవుతున్నాయి.
ప్రస్తుత ఫీచర్‌లకు అదనంగా సర్టిఫికెట్‌లలో ఈ హై-ఎండ్ సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది. ప్రస్తుత భద్రతా ఫీచర్లు ఉన్నప్పటికీ, అడ్మిషన్, ఉద్యోగాల ప్రయోజనం కోసం అసాంఘిక కొందరు నకిలీ సర్టిఫికేట్లను సృష్టిస్తున్నారు. కొత్త స్మార్ట్ చిప్ ఫీచర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల అకడమిక్ ఆధారాలతో పొందుపరచబడుతుంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు అందించే అన్ని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లకు ఇది అమలు చేయబడుతుంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్‌ను సపోర్ట్ తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్న నేపథ్యంలో యూనివర్సిటీలు జారీ చేసే సర్టిఫికెట్లలో కొత్త సెక్యూరిటీ ఫీచర్లను తీసుకురావాల్సిన అవసరం ఉందని సీనియర్ అధికారి ఒకరు సూచించారు.
ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్
నవంబర్ 18న టీఎస్‌సీహెచ్‌ఈ ఆన్‌లైన్ స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్‌ని ప్రారంభించింది. దీన్ని మరింత పటిష్టంగా, డైనమిక్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదివిన స్టూడెంట్ల సర్టిఫికెట్లను ఉన్నత విద్యా మండలి ఆన్‌లైన్ ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2010 నుంచి ఇప్పటి వరకూ చదువు పూర్తయిన ప్రతి విద్యార్థి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చారు. ఈ లెక్కన సుమారు 25 లక్షల స్టూడెంట్ల సర్టిఫికెట్లు ఒకేచోట చేర్చామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా నకిలీ సర్టిఫికెట్లను ఈజీ గుర్తించవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి, 2010 నుండి 2021 వరకు 15 విశ్వవిద్యాలయాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 25 లక్షల మంది విద్యార్థుల సమాచారం పోర్టల్‌లో ఉంది. అలాగే విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు సర్టిఫికేట్‌లను జారీ చేసినప్పుడు, పోర్టల్‌లో సమాచారం తక్షణమే అందుబాటులో ఉండేలా చూసేందుకు విశ్వవిద్యాలయాల చర్యలు తీసుకుంటున్నాయి.