ఐటీ దాడులకు టీఆర్‌ఎస్‌ భయపడదు: మంత్రి తలసాని

TS Minister Talasani said TRS is not afraid of IT raids. హైదరాబాద్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి), ఆదాయపు పన్ను (ఐటి) దాడులకు భయపడేది లేదని

By అంజి  Published on  22 Nov 2022 4:24 PM IST
ఐటీ దాడులకు టీఆర్‌ఎస్‌ భయపడదు: మంత్రి తలసాని

హైదరాబాద్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి), ఆదాయపు పన్ను (ఐటి) దాడులకు భయపడేది లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) మంగళవారం తెలిపింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్న సందర్భంగా టీఆర్‌ఎస్‌ నేతలు పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి టి.శ్రీనివాస్‌ యాదవ్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న సంస్థలను దుర్వినియోగం చేస్తోందన్నారు.

''ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కొనే బదులు.. తమ ఆధీనంలో ఉన్న సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకుని భయభ్రాంతులకు గురిచేస్తోంది. మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై ఐటీ దాడులు చేస్తోంది. ఐటీ దాడులకు మేం భయపడేవాళ్లం కాదు'' అని మంత్రి తలసాని అన్నారు. ఐటీ, ఈడీ దాడులు రోటీన్‌గా జరిగితే తప్పులేదు.. కానీ తమ పార్టీ నేతల లక్ష్యంగానే ఐటీ దాడులు జరుగుతున్నాయి. మేము ఈ దాడులను ముందే ఊహించాము. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి మాట్లాడారని అన్నారు.

అయితే అధికారం శాశ్వతం కాదని బీజేపీని మంత్రి తలసాని హెచ్చరించారు. ''ఈరోజు మీ చేతుల్లో అధికారం ఉంది. రేపు అది మా చేతుల్లోనే ఉండవచ్చు. దాడులకు టీఆర్‌ఎస్‌ నాయకత్వం భయపడడం లేదు. నిజంగా భయపడి ఉంటే హైదరాబాద్‌లో ఉండేవాళ్లం కాదు'' అని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దీనికి ప్రజాస్వామ్య పద్ధతిలో టీఆర్‌ఎస్‌ తగిన సమాధానం చెబుతుందని మంత్రి అన్నారు. దీనిపై పీపుల్స్ కోర్టులో పోరాడతామని ఆయన అన్నారు.

సంక్షేమ, అభివృద్ధి పథకాలు, పార్టీ కార్యక్రమాలపై చర్చించేందుకు ఈనెల 27న టీఆర్‌ఎస్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఐటీ శాఖ పన్ను ఎగవేత విభాగానికి చెందిన పలు బృందాలు ఉదయం నుంచి మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి.

తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు సోదరులు మహేష్ యాదవ్, ధరమ్ యాదవ్‌లను నేపాల్ క్యాసినో కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత వారం ప్రశ్నించింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా)ను ఉల్లంఘించినందుకు రాజకీయ నాయకులను ఈడీ ప్రశ్నిస్తోంది. శ్రీనివాస్ యాదవ్ వ్యక్తిగత సహాయకుడు హరీష్‌ను కూడా కేంద్ర ఏజెన్సీ సోమవారం ప్రశ్నించింది. మరోవైపు నవంబర్ 18న ఈడీ అధికారుల విచారణలో టీఆర్‌ఎస్ శాసనసభ్యుడు ఎల్.రమణ స్పృహతప్పి పడిపోయారు.

Next Story