కుమారుడికి ఛాతీలో నొప్పి.. ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఫైర్
TS Minister Mallareddy Son Mahenderreddy Fell ill. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
By అంజి Published on 23 Nov 2022 10:01 AM ISTతెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో సూరారంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొడుకు మహేందర్‌రెడ్డిని చూసేందుకు మంత్రి మల్లారెడ్డి సూరారంలోని ఆస్పత్రికి బయలుదేరారు. అదే సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్న మల్లారెడ్డిని ఐటీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో మల్లారెడ్డి అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులను నెట్టేసి తన కారులో ఆస్పత్రికి వెళ్లారు. మల్లారెడ్డి తన కుమారుడికి అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.
సోదాల చేస్తున్న టైంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అధికారులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో మల్లారెడ్డి వారిని తోసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. మరోవైపు మల్లారెడ్డి కొడుకు చేరిన ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ''నేను కష్టపడి సంపాదించాను. సమాజంలో నిజాయితీగా మెలిగాను. ఎన్నో ఏళ్లు కష్టపడితే ఈ స్థాయికి ఎదిగాను. బీజేపీ దాడులకు భయపడేది లేదు. నా కొడుకు ఆస్పత్రిలో చేరాడు. ఐటీ అధికారులు దాడి చేశారేమోనని అనుమానం కలుగుతోంది'' అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు చేయిస్తున్నారని, దొంగ వ్యాపారాలు చేస్తున్నామా? అని మల్లారెడ్డి ప్రశ్నించారు. ఐటీ అధికారులు తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. తన కొడుకు రాత్రంతా ఇబ్బంది పడ్డాడని, ఇప్పుడు చూసేందుకు వెళ్తున్నాడని, అడ్డుకోవడం దారుణమని విమర్శించారు. తన కొడుకును ఇబ్బంది పెట్టడం వల్లే ఛాతి నొప్పి వచ్చిందని వాపోయారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి ఇద్దరు కుమారులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వారి బంధువులను కూడా బుధవారం తనిఖీ చేస్తున్నారు.