తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 3 రోజు కొనసాగుతున్నాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గంగుల కమలాకర్ సమాధానం ఇచ్చారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల అమలుతో తెలంగాణ బాల్య వివాహాలను అరికట్టామని మంత్రి గంగుల తెలిపారు. ఈ రెండు పథకాల కింద రాష్ట్రంలో ఇప్పట వరకు 10,26,396 మంది లబ్ది పొందారని చెప్పారు. ఎస్సీ శాఖ ద్వారా 2,06,735 మంది, మైనార్టీ శాఖ ద్వారా 2,10,676 మంది, బీసీ సంక్షేమం ద్వారా 4,87,346 మంది, గిరిజనశాఖ ద్వారా 1,21,639 మంది లబ్ది పొందారు. బీసీ శాఖ ద్వారా రూ.4,355 కోట్లు, మైనార్టీ శాఖ ద్వారా రూ.1,682 కోట్లు, గిరిజన శాఖ ద్వారా రూ.975 కోట్లు, ఎస్సీ శాఖ ద్వారా రూ.1,660 కోట్లు.. మొత్తంగా రూ.8,673.67 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు.
ఈ రెండు పథకాలతో బాల్య వివాహాలు అరికట్టగలిగామని, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో కూడా ఈ విషయం తేలిందని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. రాష్ట్రంలో కులాంతర వివాహాలకు కూడా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. కులాంతర వివాహాలకు ఎలాంటి ఇబ్బంది లేదని భార్య బీసీ, భర్త ఓసీ అయిన చెక్‌లు ఇస్తున్నామని, ఈ విషయంలో ఎలాంటి అబ్జెక్షన్ లేదన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి విషయానికి వస్తే.. తల్లికి లేదా బిడ్డకు చెక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.