హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులను బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద కొందరు దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. న్యాయవాద దంపతుల హత్యపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఈ కేసును సుమోటోగా పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు సిజే జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. హత్యపై నివేదిక సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని.. ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించింది. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలని చెప్పింది. విచారణను మార్చి ఒకటికి వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే.. వామన్‌రావు దంపతుల హత్యకు నిరసనగా హైకోర్టులో లాయర్లు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. నేడు విచారణకు వచ్చే అన్నికేసులను బహిష్కరిస్తున్నట్లు హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రకటించింది. తెలంగాణలో న్యాయవాదులకు రక్షణ లేదని ఈ సందర్భంగా పలువురు ఆరోపించారు. వామన్‌రావు దంపతుల హత్యకేసులో దోషులను కఠినంగా శిక్షించాలని.. వారికి ఉరిశిక్ష పడే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హైకోర్టు సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.