తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. బ్యాలెట్ పేపర్లపై ఇతర ముద్రలు గల ఓట్లపై సింగిల్ జడ్జి ఉత్తర్వులపై జ్యోకం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పై స్వస్తిక్ మార్కే కాకుండా, ఎలాంటి గుర్తు పెట్టినా, చివరకు పెన్నుతో టిక్ పెట్టినా ఓటును పరిగణనలోకి తీసుకోవాలంటూ మొన్న అర్ధరాత్రి ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. ఆ ఉత్తర్వులను ఆపివేస్తూ సింగిల్ జడ్జ్ ఆదేశాలు జారీచేశారు.
ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎస్ఈసీ హైకోర్టును ఆశ్రయించింది. ఆమేరకు ఆప్పీల్ దాఖలు చేసింది. ఎస్ఈసీ అప్పీలుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తితో కూడిన దర్మాసనం.. సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. నేరేడ్‌మెట్‌లో ఫలితం నిలిచిపోయిందని ఎస్ఈసీ తెలుపగా.. సిబ్బందికి శిక్షణ లోపం కారణంగానే అలా జరిగిందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. సింగిల్ జడ్జి వద్ద సోమవారమే విచారణ ఉన్నందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. సింగిల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యాక.. అప్పుడు అభ్యంతరం ఉంటే అప్పీలు చేయాలని ఎస్ఈసీకి హైకోర్టు సూచించింది. సోమవారం ఉదయ మొదట ఈ అంశమే విచారణ జరపాలని సింగిల్ జడ్జికి ఆదేశాలు జారీ చేసింది.