తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజే బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ అయ్యారు. కేంద్రాన్ని మంత్రి హరీష్ విమర్శిస్తున్న క్రమంలో భారతీయ జనతా పార్టీ సభ్యులు అడ్డు తగిలారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతున్న ఈటల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావులను సస్పెండ్ సభ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. శాసనసభ సమావేశాలు ముగిసే వరకు ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే సస్పెన్షన్ విషయమై బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. బీజేపీ ఎమ్మెల్యేల తరఫున సీనియన్ లాయర్ ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వాదనలు వినిపించారు.
నిబంధనలు పాటించకుండా బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ సస్పెన్షన్ చేశారంటూ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనానికి తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ప్రొసీడింగ్ కాపీ ఎక్కడుందని ప్రశ్నించింది. న్యూస్ పేపర్, న్యూస్ ఛానల్స్‌లో వచ్చిన న్యూస్ ఆధారంగా పిటిషన్ వేశామంటూ తెలిపారు. సభా గౌరవానికి భంగం కలిగినప్పుడే సస్పెన్షన్ చేయాలని, కానీ అలా జరగలేదని కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్.. ప్రొసీడింగ్స్ కాపీ ఇవ్వడం కుదరదని, అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోవద్దని హైకోర్టును కోరారు. వాదనలు విన్న అనంతరం ప్రొసిడింగ్స్ కాపీపై వివరణ ఇవ్వాలని శాసనసభ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.