ఇంటర్ పరీక్షలకు లైన్ క్లియర్.. చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేం
TS High Court green signal to Inter First year exams.తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు లైన్
By తోట వంశీ కుమార్ Published on 22 Oct 2021 10:18 AM GMTతెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు లైన్ క్లియర్ అయ్యింది. పరీక్షల నిర్వహణలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 25 నుంచి పరీక్షలు జరగనుండడంతో చివరి నిమిషంలో పరీక్షలు ఆపడం సమంజసం కాదని హైకోర్టు తెలిపింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు కాగా.. దీనిపై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే విద్యార్థులు ద్వితియ సంవత్సరం చదువుతున్నారని.. మళ్లి ఇప్పుడు మొదటి సంవత్సరం సబ్జెక్టులు చదవడంతో గందరగోళానికి, ఒత్తిడికి గురవుతారంటూ పిటిషన్ తెలిపారు. పరీక్షలను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోట్ చేసిన సందర్భంలోనే పరిస్థితిని బట్టి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పామన్నారు. ఇరు పక్షాల వాదనను విన్న హైకోర్టు.. వాదనల సంగతి పక్కన బెట్టి చివరి నిమిషంలో పిటిషన్ వేస్తే ఎలా విచారణ జరుపుతామంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పిటివేషన్ వెనక్కి తీసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది.
కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఇంటర్ పరీక్షలు రద్దు అయ్యాయి. అప్పటి ప్రథమ సంవత్సరం విద్యార్థులు ప్రస్తుతం ద్వితియ సంవత్సరం చదువుతున్నారు. పరీక్షలు రాయకుండానే వారు రెండో సంవత్సరానికి ప్రమోట్ అయ్యారు. అయితే.. 70 శాతం సిలబస్‌తో వారికి ఈ సారి ప్రథమ ఏడాది పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రుల సంఘం హైకోర్టును ఆశ్రయించగా.. చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తెలిపింది. దీంతో పరీక్షలు యధావిధిగా జరగనున్నాయి. నాలుగు లక్షల యాభై వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.