రానున్న నాలుగు వారాలు కీల‌కం

TS Health Director Srinivasa Rao Press Meet.క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి త‌న పంజా విసురుతోంది. నిన్న, మొన్న‌టి వ‌ర‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jan 2022 8:49 AM GMT
రానున్న నాలుగు వారాలు కీల‌కం

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి త‌న పంజా విసురుతోంది. నిన్న, మొన్న‌టి వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లుగా క‌నిపించిన కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. క‌రోనా పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేప‌థ్యంలో రానున్న నాలుగు వారాలు చాలా కీల‌క‌మ‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు డా.శ్రీనివాస‌రావు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఫిబ్ర‌వ‌రి నెల మ‌ధ్య‌లో కేసుల మ‌ళ్లీ త‌గ్గే అవ‌కాశం ఉంద‌న్నారు. ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ వైద్య ఆరోగ్య శాఖ ప‌లు సూచ‌న‌లు చేస్తోంద‌ని.. వాటిని త‌ప్ప‌కుండా పాటించాల‌న్నారు.

రాష్ట్రంలో జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి కేసులు పెరుగుతున్నాయ‌న్నారు. ఇక జీహెచ్ఎంసీ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌) లో ఎక్కువ‌గానే కేసులు న‌మోదు అవుతున్నాయ‌న్నారు. ఈ విష‌యాన్ని ముందుగా గుర్తించిన‌ట్లు చెప్పారు. ప్ర‌తి రోజు క‌రోనా ప‌రిస్థితుల‌పై స‌మీక్ష‌లు చేప‌డుతున్న‌ట్లు వెల్ల‌డించారు. గ‌త నాలుగు, ఐదు రోజుల్లో నాలుగు రేట్ల‌కు పైగా కేసుల సంఖ్య పెరిగింది, పాజిటివిటీ రేటు కూడా 3 శాతానికి పైగా ఉంద‌న్నారు. ఇక కొత్త వేరియంట్ బారిన ప‌డిన వారు ఐదు రోజుల్లోనే కోలుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. స్వ‌ల్ప జ్వ‌రం, జ‌లుబు, తీవ్ర త‌ల‌నొప్పి వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయ‌న్నారు. ల‌క్ష‌ణాలు ఉంటే సొంత వైద్యం చేసుకోకుండా డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించాల‌న్నారు.

తొమ్మిది రకాల మందులతో హోమ్ ఐసోలేషన్ కిట్‌తో కోటి మందికి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు తెలిపారు. ఈ తొమ్మిది అంశాలు పాటించడం చాలా ముఖ్యమని చెప్పారు.

1) మాస్క్ ధరించండి

2) గుంపులు గుంపులుగా ఉండొద్దు

3) వెలుతురులో ఉండండి

4) వ్యాక్సిన్ తీసుకోండి

5) డాక్టర్ల సలహాలు సూచనలు తీసుకోవాలి.

6) అనవసరంగా ఆసుపత్రిలో చేరకండి.

7) అనవసర మందులు వాడొద్దు

8) అనవసర ఆందోళనలు వద్దు

9) లక్షణాలు ఉంటే పరీక్ష చేసుకోవాలి.

Next Story