తెలంగాణా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం ప్రచారంలో భాగంగా తెలుగు స్వాతంత్ర్య సమరయోధులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను హైదరాబాద్‌లోని సాలారాజుంగ్ మ్యూజియంలో ఇవాళ ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'హర్ ఘర్ తిరంగ' ప్రచారంలో భాగంగా ఆగస్టు 13 నుండి 15 వరకు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని గవర్నర్ తెలంగాణ ప్రజలను కోరారు. "మనం 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను చాలా గర్వంగా, గౌరవంగా, ఆనందంగా జరుపుకోవాలి. మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇందుకు మనం గర్వపడాలి" అని గవర్నర్ అన్నారు.
"స్వాతంత్ర్య పోరాటాన్ని, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవడం నేటి ప్రజలకు చాలా అవసరం. ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించి, ప్రేరణ పొంది, దేశ సేవకు తమను తాము తిరిగి అంకితం చేసుకోవాలని నేను యువతను కోరుతున్నానని" అని ఆమె తెలిపారు. త్రివర్ణ పతాకం ఫోటో ప్యానెల్‌లను గవర్నర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'హర్ ఘర్ తిరంగా' ప్రచారం భారతీయులుగా మన ఉమ్మడి గుర్తింపు అయిన జాతీయ జెండాతో ఉన్న అనుబంధాన్ని పునరుజ్జీవింపజేస్తుందని వ్యాఖ్యానించారు.
ప్రముఖ తెలుగు స్వాతంత్య్ర సమరయోధుల ప్రదర్శనను ఏర్పాటు చేయడంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిని అభినందిస్తూ, మన పూర్వీకులు ఈ రోజు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలను ఇది తరువాతి తరానికి నేర్పుతుందని అన్నారు. గతంలో ఏడాదిలో ఒక్కరోజే జెండా పండుగ వచ్చేదని.. ఇప్పుడు ఏడాదంతా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే అదృష్టం కలిగిందంటూ తమిళి సై సంతోషం వ్యక్తం చేశారు.