విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు శుభ‌వార్త‌.. అధిక ఫీజుల‌కు చెక్‌..!

TS Govt will soon curb high fees.ప్ర‌తి సంవ‌త్స‌రం ప్రైవేటు విద్యాసంస్థ‌లు ఫీజుల‌ను పెంచుకుంటూనే పోతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2022 11:42 AM IST
విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు శుభ‌వార్త‌.. అధిక ఫీజుల‌కు చెక్‌..!

ప్ర‌తి సంవ‌త్స‌రం ప్రైవేటు విద్యాసంస్థ‌లు ఫీజుల‌ను పెంచుకుంటూనే పోతున్నాయి. దీంతో సామాన్యులు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు త‌మ పిల్ల‌ల‌ను ప్రైవేటు పాఠ‌శాల‌లో చ‌దివించ‌డం త‌ల‌కు మించిన భారంగా మారుతోంది. త‌ల్లిదండ్రుల ముక్కు పిండి మ‌రీ ఫీజ‌లు వ‌సూలు చేస్తున్నాయి ప్రైవేటు విద్యా సంస్థలు. తెలంగాణ రాష్ట్రంలో త్వ‌ర‌లోనే త‌ల్లిదండ్రుల‌కు, విద్యార్థుల‌కు ప్రైవేటు విద్యాసంస్థల అధిక ఫీజు వ‌సూళ్ల‌ నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగ‌నుంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప్రైవేటు విద్యాసంస్థ‌ల్లో ఫీజుల నియంత్ర‌ణ‌పై నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇందుకు అవ‌స‌ర‌మైన విధి విధానాల‌ను రూపొందించేందుకు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఫిబ్ర‌వ‌రి 21న మంత్రుల బృందంతో కూడిన మంత్రి వ‌ర్గ స‌బ్ క‌మిటీ స‌మావేశం కానుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సహా సబ్‌కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించిన విధివిధానాలను అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేయ‌నుంది. ఫీజుల విధి విధానాల‌ను సిద్దం చేసేందుకు ఇత‌ర రాష్ట్రాల్లో అనుస‌రిస్తున్న నిబంధ‌న‌ల‌పై విద్యాశాఖ అధికారులు ఇప్ప‌టికే స‌మాచారాన్ని సేక‌రించారు. దీన్ని మంత్రి వ‌ర్గ స‌బ్ క‌మిటీ ముందు అధికారులు ఉంచ‌నున్నారు. ఇక‌.. ఫీజు నియంత్రణపై కొత్త చట్టాన్ని వ‌చ్చే అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లో తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు నియంత్ర‌ణ లేక‌పోవ‌డంతో ప్రైవేటు విద్యాసంస్థలు త‌ల్లిదండ్రుల నుంచి అధిక ఫీజుల‌ను వ‌సూలు చేస్తున్నాయి. ట్యూష‌న్ ఫీజు పేరుతో ప్ర‌తి విద్యా సంవ‌త్సరంలో 30 నుంచి 40 శాతం వ‌ర‌కు పెంచుతూ పోతున్నారు. జేఈఈ, నీట్‌, ఎంసెట్‌ వంటి వివిధ ప్రవేశ పరీక్షల కోసం ఇంటెన్సివ్ మరియు స్పెషల్ కోచింగ్ అంటూ ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఇష్టారీతిన ఫీజులు వ‌సూలు చేస్తున్నాయి. ప్రైవేటు ఆగ‌డాలు మితిమీరుతుండ‌డంతో ఫీజుల‌ను నియంత్రించాల‌ని త‌ల్లిదండ్రులు ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు.

Next Story