హైదరాబాద్ వచ్చే మహిళల కోసం.. తెలంగాణ సర్కార్ సరికొత్త మొబైల్ యాప్!
చదువుల కోసమో, ఉద్యోగ వేటలోనో మొట్టమొదటిసారి హైదరాబాద్ అడుగుపెట్టే మహిళలకు ఎదురయ్యే ప్రధాన సమస్య సురక్షితమైన వసతి.
By - అంజి |
హైదరాబాద్ వచ్చే మహిళల కోసం.. తెలంగాణ సర్కార్ సరికొత్త మొబైల్ యాప్!
చదువుల కోసమో, ఉద్యోగ వేటలోనో మొట్టమొదటిసారి హైదరాబాద్ అడుగుపెట్టే మహిళలకు ఎదురయ్యే ప్రధాన సమస్య సురక్షితమైన వసతి. ఈ ఇబ్బందులను తొలగించేందుకు తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక వినూత్న అడుగు వేసింది. ప్రభుత్వ వర్కింగ్ విమెన్ హాస్టళ్లలో వసతిని సులభంగా పొందేలా సరికొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. తమిళనాడులో ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న 'ప్రభుత్వ హాస్టల్ మేనేజ్‌మెంట్ యాప్'ను అధ్యయనం చేసిన తెలంగాణ అధికారులు, అదే తరహాలో ఇక్కడ కూడా యాప్‌ను డిజైన్ చేస్తున్నారు.
ఏ హాస్టల్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఏ గది అందుబాటులో ఉంది? అనే వివరాలు యాప్‌లో స్పష్టంగా కనిపిస్తాయి. సింగిల్ రూమ్ కావాలన్నా లేదా బడ్జెట్ తక్కువలో డార్మిటరీ కావాలన్నా మొబైల్ నుండే ఎంచుకోవచ్చు. ప్రైవేట్ హాస్టళ్ల భారం మోయలేని వారికి ఇది గొప్ప వరం. నామినల్ ఛార్జీలతో పాటు, సీసీ కెమెరాలు, నిరంతర సెక్యూరిటీతో కూడిన హై-సేఫ్టీ వాతావరణం ఇక్కడ ఉంటుంది. కేవలం పరీక్షలు రాయడానికో లేదా ఇంటర్వ్యూల కోసమో ఒకటి రెండు రోజులు నగరానికి వచ్చే మహిళలకు ఈ యాప్ ఎంతో మేలు చేస్తుంది.
ప్రైవేట్ హోటళ్లు లేదా హాస్టళ్లలో రోజువారీ ధరలు చెల్లించలేని వారు, కేవలం ఒకటి లేదా రెండు రోజుల కోసం కూడా ఈ యాప్ ద్వారా బెడ్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 ప్రభుత్వ హాస్టళ్లలో దాదాపు 7 వేల మంది మహిళలు వసతి పొందుతున్నారు. అయితే, పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం కొత్తగా మరో 16 హాస్టళ్లను నిర్మిస్తోంది. బంజారాహిల్స్ వంటి కీలక ప్రాంతాల్లో వీటి నిర్మాణం చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఇవన్నీ అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.