బాలింతలకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త.. బస్టాండ్లలో ఫీడింగ్ సెంటర్లు!

తెలంగాణ ప్రభుత్వం తల్లులు, పసిబిడ్డల సౌకర్యార్థం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది.

By -  అంజి
Published on : 8 March 2026 10:20 AM IST

Breastfeeding Centres Telangana, MGBS Hyderabad, Mothers Feed Rooms, TSRTC Bus Stations, Women and Child Welfare, Public Amenities for Mothers, Praja Palana Scheme, Medaram Jatara Inspiration

బాలింతలకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త.. బస్టాండ్లలో ఫీడింగ్ సెంటర్లు!

తెలంగాణ ప్రభుత్వం తల్లులు, పసిబిడ్డల సౌకర్యార్థం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో తల్లులు పసిపిల్లలకు పాలు పట్టేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 'బాలింతల పాలిచ్చే కేంద్రాలను' ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో భాగంగా 50 బాలింతల పాలిచ్చే కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS) సహా రాష్ట్రంలోని ఏడు ప్రధాన బస్ స్టేషన్లలో ఈ కేంద్రాలను ప్రారంభించనున్నారు. రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో ఎటువంటి అసౌకర్యం లేకుండా తల్లులు తమ బిడ్డలకు పాలు పట్టేలా చూడటమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.

కేంద్రాల్లో ఉండే సౌకర్యాలు:

ఈ కేంద్రాలు బస్టాండ్లలోని ప్రత్యేక గదులలో ఏర్పాటు చేయబడతాయి. వీటికి కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. తల్లుల సౌకర్యం కోసం గదుల్లో కుర్చీలు లేదా సోఫాలు, ఫ్యాన్లు, లైటింగ్, హ్యాండ్‌వాష్ కోసం వాష్ బేసిన్ వంటి సౌకర్యాలు ఉంటాయి. బేబీ బ్యాగులు పెట్టుకోవడానికి టేబుళ్లు, గోప్యత కోసం కర్టెన్లు ఏర్పాటు చేస్తారు. డైపర్‌లను పారవేయడానికి డస్ట్‌బిన్‌లు, వీలున్న చోట అటాచ్‌డ్ వాష్‌రూమ్‌లు కూడా అందుబాటులో ఉంచుతారు.

మేడారం జాతర స్ఫూర్తితో:

ఇటీవల జరిగిన మేడారం జాతరలో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా 13 తల్లిపాల కేంద్రాలను ఏర్పాటు చేయగా, భక్తుల నుండి విశేష స్పందన లభించింది. దీంతో ఈ సేవలను మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లోని రేతిబౌలి, ఉప్పల్, మేడ్చల్, కాచిగూడ, మల్కాజిగిరి రైల్వే స్టేషన్ సమీపంలోని బస్టాండ్లతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రధాన బస్ స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల్లో కూడా వీటిని విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

నిర్వహణ బాధ్యతలు:

ఈ కేంద్రాల నిర్వహణను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) సిబ్బందికి లేదా స్వయం సహాయక సంఘాలకు అప్పగించే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో శిశువులకు ఆహారం అందించడంలో పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి ఈ చొరవ తీసుకోవడంపై మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది.

Next Story