దళితబంధు పథకానికి మరో రూ.200 కోట్లు విడుదల
TS govt released another RS 200 crores for Dalitha Bhandhu Scheme.దళితబంధు పథకానికి తెలంగాణ ప్రభుత్వం మరో
By తోట వంశీ కుమార్ Published on 24 Aug 2021 8:30 PM ISTదళితబంధు పథకానికి తెలంగాణ ప్రభుత్వం మరో రూ. 200 కోట్లు కేటాయిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దళితుల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 16న ఈ పథకానికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించింది. నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం కింద రూ.10 లక్షల చొప్పున అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే దళిత బంధు పథకానికి ప్రభుత్వం తొలి విడత రూ. 500 కోట్లు విడుదల చేసింది. సోమవారం రెండో విడతలో మరో రూ. 500 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఇవాళ మరో 200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ పథకానికి ఇప్పటివరకు రూ. 1200 కోట్లు కేటాయించినట్లయ్యింది.
హుజూరాబాద్‌లో పొలిటికల్ హీట్..
తెలంగాణ రాజకీయాలు మొత్తం హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా అక్కడి ఓటర్లను ఆకర్శించడానికి కేసీఆర్ 'దళితబంధు' పథకాన్ని తీసుకుని రాగా.. ఆ తర్వాత కూడా ఆ నియోజకవర్గానికి చెందిన నేతలకు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. దళితుల ఓట్లను క్యాష్ చేసుకోవడానికి అన్ని పార్టీలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. హుజూరాబాద్లో సంక్షేమ,అభివృద్ది పథకాలకు టీఆర్ఎస్ ఎక్కువ టైమ్ కేటాయిస్తోంది. కేసీఆర్ కూడా హుజూరాబాద్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
మరో వైపు హుజూరాబాద్ ఉపఎన్నికల్లో తనను ఓడించే సత్తా ఎవరికీ లేదని మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈటల రాజేందర్ చెబుతున్నారు. 20 ఏళ్ల ఉద్యమ చరిత్రలో ప్రజాదరణ పొందిన వ్యక్తినని, తనను ఓడించే శక్తి ఎవరికీ లేదని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు చట్టానికి లోబడి పనిచేయాలే తప్ప చుట్టంగా పనిచేయద్దని అన్నారు. కేసీఆర్‌కు మీరేం జీతగాళ్లు కాదన్నారు. హుజూరాబాద్‌కు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు వారి నియోజక వర్గాల్లో అభివృద్ధి చేయరు కానీ హుజూరాబాద్‌లో అన్నీ చేస్తామంటూ ఊళ్లల్లో గద్దల్లా వాలిపోతున్నారని ఆగ్రహించారు. అభివృద్ధి పనుల పేరిట మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అధికార పార్టీ మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని సూచించారు. తాను రాజీనామా చేయకపోతే రేషన్‌కార్డులు, పింఛన్లు, గోర్లు, దళితబంధు పథకాలు వచ్చేవి కావని ఈటల రాజేందర్ అన్నారు. దళితబంధు కింద రూ.10 లక్షలు ఇచ్చినా, ఓటుకు రూ.లక్ష ఇచ్చినా హుజూరాబాద్‌లోని అన్ని వర్గాల ప్రజలు తనవెంటే ఉంటారని తెలిపారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలో మరో పార్టీ పోటీకి సమాయత్తమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను హుజూరాబాద్ లో పోటీ చేయాల్సిందిగా ఆ పార్టీ శ్రేణులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవలే మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. నల్గొండలో జరిగిన భారీ బహిరంగ సభతో రాజకీయాల్లోకి ప్రవీణ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న ప్రవీణ్ కుమార్‌ను హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేయాల్సిందిగా ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.