'ఆరోగ్య మ‌హిళ‌'.. ప్ర‌తి మంగ‌ళ‌వారం ప్ర‌త్యేక వైద్య ప‌రీక్ష‌లు

ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ఆరోగ్య మ‌హిళ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 March 2023 11:56 AM IST
ఆరోగ్య మ‌హిళ‌.. ప్ర‌తి మంగ‌ళ‌వారం ప్ర‌త్యేక వైద్య ప‌రీక్ష‌లు

మ‌హిళ‌ల కోసం ఇప్ప‌టికే ఎన్నో కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది తెలంగాణ ప్ర‌భుత్వం. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత‌వ్సం సంద‌ర్భంగా ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ఆరోగ్య మ‌హిళ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నుంది. దీని ద్వారా మ‌హిళ‌లు ప్ర‌ధానంగా ఎదుర్కొనే 8 ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు వైద్యం అందించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8 నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు ఆర్థిక‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు.

హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి మంత్రి హరీశ్ రావ్ ఈ పథకంపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.

8 రకాల పరీక్షలు ఇవే..

- మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు

- ఓరల్‌, సర్వైకల్‌, రొమ్ము క్యాన్సర్ల స్రీనింగ్‌

- థైరాయిడ్‌ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం, అయోడిన్‌ సమస్య, ఫోలిక్‌యాసిడ్‌, ఐరన్‌లోపంతోపాటు విటమిన్‌ బీ12, విటమిన్‌ డీ పరీక్షలు చేసి చికిత్స, మందులు అంద‌జేత‌

- మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు

- మెనోపాజ్‌ దశకు సంబంధించి పరీక్షలు. అవసరమైన వారికి హార్మోన్‌ రీప్లేస్మెంట్‌ థెరపీ చేయడంతోపాటు కౌన్సెలింగ్‌.

- నెలసరి, సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు, వైద్యంతో పాటు అవగాహన. అవసరమైనవారికి అల్ట్రాసౌండ్‌ పరీక్షలు.

- సెక్స్‌ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి, అవగాహన. అవసరమైన వారికి వైద్యం.

- బరువు నియంత్రణ, యోగా, వ్యాయామంపై అవగాహన.

పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, బస్తీ దవాఖానల్లో ప్రతి మంగళవారం ప్రత్యేకంగా ఈ వైద్య పరీక్షలు చేయ‌నున్నారు. తొలి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక క్లినిక్‌లు ప్రారంభించ‌నున్నారు. ఆయా వైద్య పరీక్షలపై ప్రత్యే క యాప్‌ ద్వారా మానిటరింగ్ చేయ‌నున్నారు. ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే రెఫర్ చేయ‌నున్నారు. పెద్దాసుపత్రుల్లో వారికి సాయం చేసేందుకు ప్రత్యేక హెల్ప్‌ డెస్‌లు ఉంటాయి.

Next Story