కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పలు పరీక్షలను రద్దు చేయగా.. మరికొన్నింటిని వాయిదా వేశారు. ఇక ఇంటర్ ద్వితియ సంవత్సర పరీక్షలు నిర్వహించాలని బావించినా.. ప్రస్తుత పరిస్థితుల్లో రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో.. రాష్ట్రంలోనూ ఇంటర్ మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలను రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై నేడో, రేపో నిర్ణయం తీసుకోవచ్చునని విద్యాశాఖ అధికారులు అంటున్నారు.
పరీక్షల నిర్వహణకు వీలులేకుంటే వాటిని రద్దు చేసి తొలి ఏడాదిలో సాధించిన మార్కులనే రెండో ఏడాదిలోనూ ఇవ్వాలని నెలక్రితం ఇంటర్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఒకవేళ తమకు మార్కులు సరిపోవనుకున్న వారికి అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు పరీక్షలు రాసుకునే ఆప్షన్ ఇస్తామని ఇంటర్ బోర్డు స్పష్టం చేయనుంది. సైన్స్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉన్నందున వాటిని రద్దు చేసి.. విద్యార్థులు రాసే సైన్స్ రికార్డుల ఆధారంగా ప్రాక్టికల్ మార్కులు కేటాయించనున్నారు. రాష్ట్రంలో సుమారు నాలుగురు లక్షల మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫీజులు చెల్లించారు. ఇక మొదటి సంవత్సర విద్యార్థులకు మాత్రం(రెండో ఏడాదిలోకి వచ్చేవారు)కి మాత్రం సమీప భవిష్యత్తులో పరీక్షలు నిర్వహించనున్నారు.