ఇబ్రహీంపట్నం కు.ని ఆపరేషన్ల ఘటన.. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు
TS Govt has taken action against IBP family planning incident.ఇబ్రహీంపట్నంలో కు.ని ఆపరేషన్ల ఘటన బాధ్యులపై
By తోట వంశీ కుమార్ Published on 24 Sep 2022 5:24 AM GMTఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ(కు.ని) ఆపరేషన్ల ఘటన బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు 25న ఇబ్రహీంపట్నంలో ఒక గంట వ్యవధిలో 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన విషయం తెలిసిందే. శస్త్ర చికిత్స వికటించి నలుగురు మహిళలు మరణించారు. ఈ ఘటనపై ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి, డీసీహెచ్‌ఎస్ ఝాన్సీ లక్ష్మిపై బదిలీ వేటువేసింది. ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ కుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. వీరితో పాటు మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిటీ పలు మార్గదర్శకాలు జారీ చేసింది.
మార్గదర్శకాలు..
- ఆసుపత్రుల సేవల్లో భాగంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలి
- కు.ని ఆపరేషన్లు నిర్ణయించిన రోజులో మాత్రమే చేయాలి. ఆపరేషన్ తర్వాత 24 గంటల పాటు విధిగా అబ్జర్వేషన్‌లో ఉంచాలి.
- ముందుగా నిర్ణయించిన క్యాలెండర్ ప్రకారం.. ఆపరేషన్ చేసుకునే వారు, వారికి ఇష్టం ఉన్న రోజులో రావొచ్చు.
- డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళిన పేషెంట్‌ను సంబంధిత ఆసుపత్రి సూపర్ వైజర్ 24 గంటల్లోగా ఒకసారి, వారంలోగా మరో రెండు సార్లు వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలి.
- సంబంధిత పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ కూడా వారి పరిధిలోని ఆపరేషన్ చేసుకున్న వారందరినీ రెండు రోజుల్లోగా వెళ్లి పరిశీలించాలి. పేషెంట్ సంబంధిత సూపర్ వైజర్ పేషెంట్లను మానిటర్ చేస్తున్నారా లేదా మెడికల్ ఆఫీసర్ చూసుకోవాలి
- ప్రీ ఆపరేటివ్, ఇంట్రా ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్ ప్రమాణాలు పాటించేలా ఆసుపత్రి సూపరింటెండెంట్, సర్జన్, డీపీఎల్ క్యాంపు ఆఫీసర్ చూసుకోవాలి.
- ఆపరేషన్ల తర్వాత తలెత్తే సమస్యలను గుర్తుపట్టే విధంగా సూపర్ వైజర్లకు ఎప్పటికపుడు శిక్షణ తరగతులు నిర్వహించాలి.
- ఏడాదికి ఒకసారి డీపీల్ సర్జన్ల నైపుణ్యతను అంచనా వేసే విధంగా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
- కమిషనర్ ఆఫీసులోని రాష్ట్ర స్థాయి జాయింట్ డైరెక్టర్ మూడు నెలలకు ఒకసారి స్టెరిలైజేషన్ మీద కు.ని నిర్వహణ అధికారులు, సర్జన్లు, ఇతర సిబ్బందితో సమీక్ష జరపాలి.
- నాణ్యత ప్రమాణాలను అనుసరించి ఒకరోజు ఒక ఆసుపత్రిలో 30కి మించి ఆపరేషన్లు చేయరాదు.
- ఆయా ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ ఛైర్మెన్‌గా ఉన్న సూపరింటెండెంట్లు ప్రతి సోమవారం ఇన్ఫెక్షన్ నివారణ, నియంత్రణ మీద సమీక్ష చేయాలి.
- బోధన ఆసుపత్రులు, టీవీవీపీ ఆసుపత్రుల్లోని ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్లు, నర్సులకు ఇన్ఫెక్షన్ కంట్రోల్ నూతన పద్ధతులపై ఎప్పటికప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో శిక్షణ ఇవ్వాలి.
- ఇన్ఫెక్షన్ నివారణ ప్రమాణాలు పాటించే విధంగా డీఎమ్‌ఈ, టీవీవీపీ కమిషనర్ చూసుకోవాలి, ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల్లో ప్రత్యేక దృష్టి సారించాలి.