హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 3897 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్ రావు గురువారం ప్రకటించారు. ఒక్కో కాలేజీకి 433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్, జనగాం, నిర్మల్‌లోని 9 కొత్త మెడికల్ కాలేజీలు, అటాచ్‌డ్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌లో ఒక్కో కాలేజీకి 433 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు పడిందన్నారు. అందరికీ మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.