తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై అసహనం
TS Governor tamilisai letter to Govt on joint recruitment of universities bill. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై యూనివర్సిటీ
By అంజి
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు తమిళిసై ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా.. పట్టించుకోలేదని ఆరోపణలు చేశారు. తాజాగా రాష్ట్రంలోని యూనివర్సిటీల జాయింట్ రిక్రూట్‌మెంట్ బిల్లుపై టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లెటర్ రాశారు. రాజ్‌భవన్‌కు వచ్చి బిల్లుపై చర్చించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు. అలాగే ఈ బిల్లుపై అభిప్రాయం కోరుతూ యూజీసీకి కూడా గవర్నర్ లెటర్ రాశారు.
తెలంగాణ అసెంబ్లీ ఇటీవల ఆమోదించిన ఏడు బిల్లులు ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. అందులో కీలకమైన యూనివర్సిటీల జాయింట్ రిక్రూట్‌మెంట్ బిల్లు కూడా ఉంది. భారీగా ఉద్యోగ నియామకాలు, యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల భర్తీని చేపట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇందు కోసం ఉమ్మడి నియామక బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుని, అందుకు అనుగుణంగా బిల్లును ప్రవేశ పెట్టి అసెంబ్లీలో ఆమోదించింది. అయితే ఇప్పటి వరకు గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదం తెలపకపోవడంతో యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ చేపట్టేందుకు వీలు లేకుండా పోయింది.
మరోవైపు విద్యార్థి సంఘాల నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లు ఆమోదంపై ఒత్తిడి వస్తోంది. రెండు రోజుల్లోగా బిల్లుకు ఆమోదం తెలపకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని విద్యార్థి ఐక్య కార్యచరణ సమితి పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్రప్రభుత్వానికి, యూజీసీకి గవర్నర్ లెటర్ రాశారు. ఈ బిల్లు ఆమోదించడం ద్వారా ఏమైనా న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయా? అలా జరిగితే వాటిని ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ మంత్రి రాజ్‌భవన్ వచ్చి బిల్లుపై చర్చించాలని తమిళిసై సూచించారు.