తెలంగాణ ఎంసెట్ పేరు మార్పు.. ప్రవేశ పరీక్షల తేదీలివే..
తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 25 Jan 2024 7:00 PM ISTతెలంగాణ ఎంసెట్ పేరు మార్పు.. ప్రవేశ పరీక్షల తేదీలివే..
తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఎంసెట్ పేరుతో నిర్వహిస్తున్న పరీక్ష పేరును మార్చింది. ఈ మేరకు తెలంగాణ ఎంసెట్ (TS EAMCET) పేరును టీఎస్ ఈఏపీసెట్ (TS EAPCET)గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఎంసెట్ పేరుతో కాకుండా.. టీఎస్ ఈఏపీసెట్ పేరుతోనే ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. TS EAPCET సహా మరో ఆరు కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలకు నోటిఫికేషన్ కూడా విదుదల చేసింది. మే 9వ తేదీ నుంచి 11 వరకు ఇంజినీరింగ్ పరీక్ష, మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు, మే 6న టీఎస్ ఈసెట్ పరీక్ష, జూన్ 4న ఐసెట్ ప్రవేశ పరీక్ష, జూన్ 6 నుంచి 8వ తేదీ వరకు టీఎస్ పీజీఈసెట్ పరీక్ష ఉంటుందని ఉన్నత విద్యామండలి పేర్కొంది.
కాగా.. రాష్ట్రంలో టీఎస్ ఎంసెట్ ద్వారా పరీక్ష నిర్వహించి ఆ తర్వాత రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో విద్యార్థులను భర్తీ చేస్తున్నారు. మొదట్లో ఈ టీఎస్ ఎంసెట్ ద్వారా మెడికల్ సీట్లు కూడా భర్తీ చేసేవారు. అయితే.. ఐదారేళ్లుగా మెడికల్ సీట్ల భర్తీని నీట్ ద్వారా చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెడికల్ ఎంసెట్‌లో ఉన్న మెడికల్ పేరుని తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి బదులుగా ఫార్మసీ అనే పదాన్ని చేర్చింది. ఈ మార్పు వల్ల టీఎస్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎంసెట్)గా ఉన్న పేరు టీఎస్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAPCET)గా మారింది.
నేషనల్ ఎలిజిబిలిఈ కమ్ ఎంట్రన్స్ టెస్టు (NEET) యూజీని ప్రవేశపెట్టిన అనంతరం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలను ఎంసెట్ నుంచి తొలగించారు. కానీ.. ఎంసెట్‌లో మెడిసిన్ అనే పదం కొన్నేళ్ల నుంచి కొనసాగుతూనే వచ్చింది. అయితే.. దాన్ని తొలగించాలని ప్రభుత్వం.. ఉన్నత విద్యా మండలికి ప్రతిపాదనలు పంపింది. కాగా. పేరు మార్పుల వల్ల వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఎప్పటిలానే ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతాయి.