తెలంగాణ‌లో హెల్త్ బ‌డ్జెట్‌ 78.5శాతం పెరిగింది

TS Budget 2022 health budget hiked by 78.5% .తెలంగాణ ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి ఆరోగ్య బడ్జెట్‌ను 78.5%

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2022 2:15 PM GMT
తెలంగాణ‌లో హెల్త్ బ‌డ్జెట్‌ 78.5శాతం పెరిగింది

తెలంగాణ ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి ఆరోగ్య బడ్జెట్‌ను 78.5% పెంచింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్య రంగానికి రూ. 11,237 కోట్ల బ‌డ్జెట్ కేటాయింపు నిచ్చింది. అంక‌ముందు ఆర్థిక సంవ‌త్స‌రం (2021-22) రూ.6,295 కోట్ల‌తో పోలిస్తే ఇది రూ.4,942 కోట్లు అద‌నం.

హైదరాబాద్‌లో వైద్య సదుపాయాలను విస్తరించేందుకు ఈ నిధుల‌ను ఖ‌ర్చుచేయ‌నుంది. నగరంలోని నాలుగు మూలల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్థలను సమిష్టిగా తెలంగాణ ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) అని పిలుస్తారు. గచ్చిబౌలి, ఎల్‌బీ నగర్‌, అల్వాల్‌, ఎర్రగడ్డలో ఈ ఆసుపత్రులు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 1,000 పడకలు ఉంటాయి. అదే విధంగా నిమ్స్‌లో అద‌నంగా మ‌రో 2,000 పడకలను ఏర్పాటు చేయ‌నున్నారు. దీంతో నిమ్స్‌లో మొత్తం పడకల సంఖ్య 3,489కి చేరనుంది.

ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో రాష్ట్రంలో ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, వికారాబాద్‌, సిరిసిల్ల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మంలో ఎనిమిది కొత్త మెడికల్‌ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. 2023లో మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల్, యాదాద్రి తదితర ఎనిమిది జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.1,000 కోట్లను బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించింది.

ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రాంతంలో కేవలం మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఏర్పాటయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం రాకముందే ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు ఏర్పాటయ్యాయని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేటలో నాలుగు కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కళాశాలలు ప్రారంభమయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, భవనాలు నిర్మిస్తున్నామని, సిబ్బందిని కూడా నియమిస్తున్నామని మంత్రి తెలిపారు.

బస్తీ దవాఖానా

హైదరాబాద్ మహానగరంలో మ‌రో 57 బస్తీ దవాఖానలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానాలు ఉండాలని నిర్ణయించామని.. ప్రస్తుతం 256 బస్తీ దవాఖానాలు పని చేస్తున్నాయన్నారు. బ‌స్తీ ద‌వాఖానాల్లో ఉచిత వైద్యంతో పాటు 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని హరీష్ రావు చెప్పారు.

ఆసుపత్రుల్లో మౌలిక వసతుల మెరుగుదల

ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు డైట్ చార్జీలను రెట్టింపు చేస్తున్నారు. టీబీ, క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు డైట్‌ చార్జీలను పెంచుతున్నారు. మంచానికి రూ.56 నుంచి రూ.112, అదేవిధంగా ఇతర రోగులకు డైట్ ఛార్జీలను రూ.40 నుంచి రూ.80 పెంచుతున్న‌ట్లు తెలిపారు. ఇందుకోసం రూ. 43.5 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

హైదరాబాద్‌లో 18 ప్రధాన ఆసుపత్రులున్నాయి. ఈ ఆస్ప‌త్రుల‌కు రోగులే కాకుండా వారితో పాటు వారి కుటుంబ స‌భ్యులు కూడా వ‌స్తుంటారు. అటెండర్లకు కూడా సబ్సిడీపై ఆహారం అందించాలని నిర్ణయించారు. దీని ద్వారా రోజూ 18,600 మంది లబ్ధి పొందుతారని అంచనా. ఇందుకోసం రూ. 38.66 కోట్లు ప్రతిపాదించారు. ఆసుపత్రుల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు పారిశుధ్య కార్మికులు, ఇతరుల వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో బెడ్‌కు పారిశుద్ధ్య వ్యయాన్ని రూ. 5,000 నుండి రూ. 7,500 పెంచ‌నుంది. ఇందుకోసం రూ. 338 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

రాష్ట్రంలో మార్చురీలు దయనీయ స్థితిలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 61 మార్చురీలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం రూ. 32.5 కోట్లు కేటాయించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరోగ్య శ్రీ పై రూ.2ల‌క్ష‌ల వ‌ర‌కు ఉచితంగా వైద్యం అందిస్తుండ‌గా.. దీన్ని రూ.5ల‌క్ష‌ల‌కు పెంచారు. గుండె, కాలేయం మరియు ఎముక మజ్జ మార్పిడి కోసం, రూ. 10 లక్షలు అందజేస్తారు.

Next Story