నేడే టీఆర్‌ఎస్‌ ప్లీనరీ.. ఆమోదం తెలుపనున్న తీర్మానాలు ఇవే

TRS plenary session to take place in Hyderabad today.తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్‌) పార్టీ ఆవిర్భావ దినోత్సవం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 April 2022 4:54 AM GMT
నేడే టీఆర్‌ఎస్‌ ప్లీనరీ.. ఆమోదం తెలుపనున్న తీర్మానాలు ఇవే

తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్‌) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. టీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటా జెండా పండుగ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు వారి వారి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ నగరంలోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 40 అడుగుల జెండాను ఆవిష్కరించారు.

ప్లీన‌రీకి స‌ర్వం సిద్దం

హైద‌రాబాద్ మాదాపూర్ హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీన‌రీకి స‌ర్వం సిద్దం చేశారు. ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ నగరం మొత్తం గులాబీమయంగా మారిపోయింది. రోడ్డుపొడవునా స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మూడు వేల మందికి ఆహ్వానాలు పంపగా.. ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ ఛైర్మన్‌లు, పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ మేయర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌లు ఒక్కొక్క‌రుగా హాజరవుతున్నారు. ఎవ్వ‌రికి ఎలాంటి అసౌక‌ర్యాలు క‌లుగ‌కుండా ఏర్పాట్లు చేశారు.

ఈ ప్లీనరీ సమావేశంలో టీఆర్ఎస్ ప‌లు తీర్మానాలు చేయనుంది.

ఏ తీర్మానాన్ని ఎవ‌రు ప్ర‌వేశ‌పెడుతారంటే..

- దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక భూమిక పోషించాలని ప్రతిపాదిస్తూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడుతారు.

- ఆకాశాన్ని అంటేలా ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధరలను నియంత్రించాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తీర్మానం ప్రవేశపెడుతారు.

- యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానాన్ని వ్యసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రతిపాదిస్తారు.

- చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసి అమలు చేయాలని డిమాండ్‌ చూస్తూ మంత్రి సత్యవతి రాథోడ్‌ తీర్మానం ప్రవేశపెడుతారు.

- రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని, డివిజబుల్‌ పూల్‌లోనే పన్నులు వసులు చేయాలని మంత్రి హరీశ్‌ రావు తీర్మానం ప్రవేశపెడుతారు.

- భారతేదశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ.వినోద్‌ కుమార్‌ తీర్మానం ప్రవేశపెడుతారు.

- బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ జనగణన జరపాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్సీ మధుసూదనా చారి తీర్మానం ప్రవేశపెడుతారు.

- తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్‌ శాతం పెంచాలని, ఎస్సీ వర్గీకరణ తక్షణమే చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ మంత్రి మహమూద్‌ అలీ తీర్మానం ప్రవేశపెడుతారు.

- నదీ జలాల వివాద చట్టం సెక్షన్‌-3 ప్రకారం కృష్ణాజలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నిర్ణయించాలని, ఈ మేరకు బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు కేంద్రం రిఫర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.

- భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపినిస్తూ ఎంపీ నామా నాగేశ్వర్‌ రావు తీర్మానం ప్రవేశపెడుతారు.

- రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను, వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీర్మానం ప్రవేశపెడుతారు.

- దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీర్మానం ప్రతిపాదిస్తారు.

- చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, చేనేత రంగాన్ని దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఎమ్మెల్సీ ఎల్.రమణ తీర్మానం ప్రవేశపెడుతారు.

Next Story
Share it