మిషన్ నిజామాబాద్: అభివృద్ధిపై ఎమ్మెల్సీ కవిత స్పెషల్‌ ఫోకస్‌

TRS MLC Kavitha reminds people of KCR's Welfare schemes. నిజామాబాద్‌: సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల వల్ల

By అంజి  Published on  22 Dec 2022 4:41 PM IST
మిషన్ నిజామాబాద్: అభివృద్ధిపై ఎమ్మెల్సీ కవిత స్పెషల్‌ ఫోకస్‌

నిజామాబాద్‌: సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల వల్ల తెలంగాణలో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కుమార్తె కె.కవిత గురువారం అన్నారు. తెలంగాణ మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేసుకున్నారు. నిజామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ.. ఆయన ఎప్పుడూ విజన్‌తో పథకాలు ప్రవేశపెడతారని చెప్పారు.

షాదీ ముబారక్ పథకాన్ని కేసీఆర్ ఎలా అమలు చేశారో కవిత వివరించారు. ''తెలంగాణ ఏర్పాటైన సమయంలో కేసీఆర్ వరంగల్‌లోని ఓ గ్రామంలో పర్యటించారు. ఆ సమయంలో ఇల్లు కోల్పోయిన (కాలిపోయిన) ఓ వ్యక్తి.. కేసీఆర్‌ని కలిసి తన బిడ్డ పెళ్లి కోసం కూడబెట్టిన డబ్బులు కూడా ఇంట్లోనే కాలిపోయాయని బాధపడుతూ చెప్పాడు. ఎంత కావాలి అని కేసీఆర్‌ అడగడంతో.. పెళ్లికి రూ.50 వేలు కావాలని ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో కేసీఆర్‌ అప్పటికప్పుడు రూ.50 వేలు సేకరించి అతడికి ఇచ్చాడు. దీంతో ఆ పెళ్లి ఘనంగా జరిగింది. అక్కడి నుంచే సీఎం కేసీఆర్‌కు ఈ ఆలోచన వచ్చింది'' అని కవిత చెప్పారు. ఆ తర్వాత ఈ పథకం ద్వారా తెలంగాణలోని ప్రతి కూతురి పెళ్లికి డబ్బును అందించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఇచ్చే డబ్బులను రూ.50,000 నుండి రూ.1 లక్షకు పెంచారు.

భారతదేశంలోని మరే రాష్ట్రంలోనూ నవ వధూవరులకు ఇలాంటి పథకం లేదని, టీఆర్‌ఎస్ భావజాలం ఇప్పుడు బీఆర్‌ఎస్‌తో దేశమంతటా వ్యాపిస్తుందని కవిత అన్నారు. నిజామాబాద్ ప్రజలను ఉద్దేశించి కవిత మాట్లాడుతూ.. త్వరలో నిజామాబాద్ రూ. 100 కోట్లు మంజూరు చేస్తామన్నారు. నిజమాబాద్‌ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. పాత భవనాలను కూల్చేసి కొత్త భవనాలు నిర్మిస్తామన్నారు. పాత బస్టాండ్‌ను కుల్చేసి.. రైల్వే స్టేషన్‌ సమీపంలో కొత్త బస్టాండ్‌ను నిర్మిస్తామని చెప్పారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

టార్గెట్ నిజామాబాద్

కవిత తన ప్రసంగంలో ప్రతిపక్ష బిజెపి నాయకులు నిరసనలు చేయడం ద్వారా అతిగా స్పందించవద్దని, బదులుగా నిజామాబాద్ అభివృద్ధికి బిఆర్ఎస్ పార్టీ ఏమి చేస్తుందో గమనించాలని కోరారు.

నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఒకరోజు ముందు బీజేపీ నేతలు ర్యాలీ చేపట్టారు. పాత కలెక్టరేట్‌, జిల్లా విద్యాశాఖ కార్యాలయం, తహశీల్దార్‌ కార్యాలయాల్లోని విలువైన భూములను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆరోపించారు.

లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి 70,875 ఓట్ల తేడాతో అరవింద్ ధర్మపురిపై కవిత ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, 2019లో బీజేపీ చేతిలో ఓడిపోయిన నిజామాబాద్ లోక్‌సభ సీటును తిరిగి కైవసం చేసుకునేందుకు అధికార బీఆర్‌ఎస్ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. గురువారం నిజామాబాద్‌లో తన ప్రసంగంలో నిజామాబాద్ నియోజకవర్గం అభివృద్ధిపై కవిత దృష్టి సారించారు.

Next Story