విరాళాలపై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
TRS MLA Vidyasagar Rao. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర విరాళాలపై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.
By Medi Samrat Published on 22 Jan 2021 5:16 PM ISTఅయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర విరాళాల కార్యక్రమం ప్రారంభించింది. జనవరి 15న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఫిబ్రవరి 27 వరకూ కొనసాగనుంది. రామ మందిర నిర్మాణం ప్రారంభమైందని, 39 నెలల్లో ఇది పూర్తవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దంటూ కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడిన ఆయన అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దంటూ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాముడు మనకెందుకు.. మన దగ్గర రాముడి ఆలయాలు లేవా? అంటూ ప్రశ్నించి.. కొత్త వివాదానికి తెరలేపారు. అంతేకాదు.. బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. రాముని పేరు మీద భిక్షం ఎత్తుకుంటున్నారని, కొత్త నాటాకనికి తెర లేపుతున్నారంటూ వ్యాఖ్యానించారు. బొట్టు పెట్టుకుంటేనే రాముని భక్తులా..? అని ప్రశ్నించిన ఆయన.. తామంతా శ్రీరాముని భక్తులమేనని చెప్పుకొచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లో రామాలయం నిర్మిస్తే మనమెందుకు విరాళాలు ఇవ్వాలని అన్నారు. మన దగ్గర రాముడి ఆలయాలు లేవా అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. తన వ్యాఖ్యలపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటే అందుకు క్షమాపణలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. విరాళాల విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పానని వివరించారు. కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి, దుష్ప్రచారం చేస్తున్నారని విద్యాసాగర్ రావు ఆరోపించారు. తాను కూడా రాముడి భక్తుడినే అని, తాను కూడా అయోధ్య వెళతానని చెప్పుకొచ్చారు. బీజేపీ మత రాజకీయాలు మానుకుంటే బాగుంటుందని, దీనిపై రాజకీయం చేయడం తగదు అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. మెట్ పల్లిలోని విద్యాసాగర్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇంతలో ఆయన క్షమాపణలు చెప్పుకొచ్చారు.