టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ.. బీజేపీలోకి స్వామిగౌడ్
TRS Leader Swamy goud Jions BJP .. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శాసన మండలి మాజీ చైర్మన్,
By సుభాష్ Published on 25 Nov 2020 1:57 PM GMTతెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శాసన మండలి మాజీ చైర్మన్, టీఆర్‌ఎస్ సీనియర్ నేత స్వామిగౌడ్ బుధవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న స్వామిగౌడ్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకొన్నారు. స్వామిగౌడ్ వెంట ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ రామచంద్రారవు ఉన్నారు. ఇక త్వరలో జరుగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలోని కీలక నేత కమలం గూటికి చేరడంతో టీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. కాగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో మార్పులు జరుగుతున్నాయి. ఈసారి ఎలాగైనా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కమళం వికసించాలని బీజేపీ ఊవ్విళ్లూరుతోంది. అందుకు అనుగుణంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ప్రచారంపై దృష్టి పెడుతూ ప్రధాన నేతలకు గాలం వేస్తోంది. ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు బీజేపీ గూటికి చేరుకుని టికెట్ సాధించగా, తాజాగా స్వామిగౌడ్ చేరడం సంచలనంగా మారింది.
టీఆర్‌ఎస్‌లో జెండా పట్టిన వారికి ప్రాధాన్యత లేదు: స్వామి గౌడ్
కాగా, బీజేపీలో చేరడం అంటే తన తల్లిగారింటికి చేరినట్లు భావిస్తున్నానని స్వామిగౌడ్ అన్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జెండా పట్టని వారికి కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం దొరుకుతుందనే ఉద్దేశంతో బీజేపీలో చేరాను. వందసార్లు కేసీఆర్ కలిసేందుకు ప్రయత్నించినా ఒక్కసారైనా అవకాశం ఇవ్వలేదు, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మాభిమానం కాపాడుకునేందుకే బీజేపీలో చేరాను. ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో ఎంతో మంది అవమానానికి గురవుతున్నారు. తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుంది. హైదరాబాద్ మేయర్ స్థానం ఖచ్చితంగా బీజేపీ గెలుచుకుంటుంది అని స్వామి గౌడ్ అన్నారు.