కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ధూంధాం కార్యక్రమానికి ఓ దివ్యాంగుడు హాజరయ్యాడు. కార్యక్రమానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేయనున్న గెల్లు శ్రీనివాస్‌తో పాటూ పలువురు నాయకులు కూడా హాజరయ్యారు. సభ జరుగుతున్న సమయంలో దివ్యాంగుడు రాజేష్ తనకు పింఛన్ రావడం లేదని నాయకులను కలిసేందుకు ప్రయత్నించాడు. అతన్ని పోలీసులు, స్థానిక నాయకులు అడ్డుకున్నారు. సభ ముగిసిన తర్వాత దివ్యాంగుడు స్టేజి పైకి ఎక్కి తనకు పింఛన్ ఇవ్వడం లేదంటూ మైకులో చెప్పాడు.
అక్కడే ఉన్న టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ మహేంద్రాచారి ఆగ్రహంతో తన ప్రతాపాన్ని దివ్యాంగుడిపై చూపించాడు. స్టేజి పైకి ఎక్కి దివ్యాంగుడు రాజేష్‌ను కిందకు లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే కొందరు నాయకులు మాత్రం మహేంద్రాచారిని అడ్డుకున్నారు. అక్కడున్న వారంతా మహేంద్రా చారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపం దివ్యాంగుడికి తోడుగా నిలవకుండా ఇలా దాడి చేయడం ఏమిటని గడ్డి పెట్టారు. కొందరు ఈ ఘటనను వీడియో కూడా తీశారు. దీంతో టీఆర్ఎస్ నాయకుడు దివ్యాంగుడిపై దాడికి పాల్పడడాన్ని నెటిజన్లు చూసి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.