ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసిన టీఆర్ఎస్‌..కూసుకుంట్ల గెలుపుతోనే మునుగోడుకు మంచిరోజులు

TRS intensified the campaign.మునుగోడు ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డ‌డంతో టీఆర్ఎస్ పార్టీ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Oct 2022 2:20 PM IST
ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసిన టీఆర్ఎస్‌..కూసుకుంట్ల గెలుపుతోనే మునుగోడుకు మంచిరోజులు

మునుగోడు ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డ‌డంతో తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్) పార్టీ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో మ‌కాం వేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయ‌కులు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ తిరుగుతూ పార్టీ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలను వివ‌రిస్తున్నారు. బీజేపీ స్వార్ధం వల్లే ఉపఎన్నిక వచ్చిందని, మునుగోడు అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ప్రచారం నిర్వహిస్తున్నారు.

కాంట్రాక్టుల‌ కోస‌మే బీజేపీలో చేరిన కోమ‌టిరెడ్డి : మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి

కాంట్రాక్టుల కోసమే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీలో చేరార‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి మండిప‌డ్డారు. మునుగోడు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని బీజేపీ ద‌గ్గ‌ర తాక‌ట్టు పెట్టిన దుర్మార్గుడ‌న్నారు. వెల‌మ‌క‌న్నెలో మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. రోడ్ షోలో మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌కు రాజ‌కీయాలు ముఖ్యం కాద‌ని, అభివృద్ధే ల‌క్ష్య‌మ‌న్నారు. ద‌శాబ్దాలుగా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టిపీడించిన ఫ్లోరైడ్ స‌మ‌స్య‌ను తీర్చిన ఘ‌న‌త కేసీఆర్‌దేన‌ని అన్నారు.


చండూరులో మంత్రి ఎర్ర‌బెల్లి

చండూరు ప‌ట్ట‌ణంలోని 2వ‌, 3వ వార్డులో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఇంటింటా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని అభ్య‌ర్థించారు. కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంద‌న్నారు. ఓ చేనేత కార్మికుడి ఇంటికి వెళ్లి మగ్గం నేసి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు.


కూసుకుంట్ల గెలుపుతోనే మునుగోడుకు మంచిరోజులు : చిరుమ‌ర్తి లింగ‌య్య

సంస్థాన్ నారాయణపురంలోని గుజ్జ గ్రామంలో న‌కిరేక‌ల్ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించారు. సీఎం కేసీఆర్ ద‌ళితుల ప‌క్ష‌పాతిగా పాల‌న సాగిస్తున్నార‌ని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలకు సీఎం కేసీఆర్‌తోనే మేలు జరుగుతుందన్నారు. కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి గెలుపుతోనే మునుగోడుకు మంచి రోజులు వ‌స్తాయ‌న్నారు.


Next Story