నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. టీఆర్ఎస్ సీనియర్ నేత, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు టీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చింది. ఈ మేరకు టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా భగత్‌కు బీఫామ్ అందజేశారు.
అంతేకాకుండా పార్టీ తరుపు ప్రచారం కోసం 28లక్షల చెక్‌ను కూడా అందించారని సమాచారం. టికెట్ కన్ఫర్మ్ అయిన నేఫథ్యంలో రేపు ఉదయం భగత్ తన నామినేషన్ వేయనున్నారు. ఇక సాగర్ ఉప ఎన్నికలో టికెట్ ఆశించిన టీఆర్‌ఎస్ నేత కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని ప్రకటించింది. మరో ప్రధాన పార్టీ బీజేపీ.. తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు.
ఇదిలావుంటే.. సాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు రేపే చివరి గడువు తేదీ. కాగా, ఈనెల 31న నామినేషన్ల పరిశీలన జరుగనుండగా.. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఇక ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.