ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ప్రధాని పీవీ కుమారై సురభి వాణిదేవి విజయం సాధించారు. నాలుగు రోజుల పాటు ఉత్కంఠ రేపిన ఓట్ల లెక్కింపులో రెండో ప్రాధాన్యతా ఓటుతో వాణిదేవి విజేతగా నిలిచారు. అయితే ఆమె గెలుపును ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మొదటి ప్రాధాన్యతలో లక్షా 12 వేల 689 ఓట్లు రాగా.. రెండో ప్రాధాన్యతలో 36 వేల 580 లభించాయి. మొత్తంగా 1,49,249 ఓట్లు సాధించారు.
మొదటి రౌండ్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి ఆధిక్యంలో కొనసాగింది. ఏడు రౌండ్లలోనూ వాణిదేవికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు మొత్తం లక్షా 37 వేల 566 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యతలో లక్షా 4 వేల 668 ఓట్లు కాగా.. 32 వేల 898 ఓట్లు వచ్చాయి. బీజేపీకి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ సిట్టింగ్ స్థానం కాగా.. చివరి వరకు ఫలితాలపై ఉత్కంఠ కొనసాగింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎలిమినేషన్.. ఆయన రెండో ప్రాధాన్యత ఓట్లు భారీగా టీఆర్ఎస్‌కు రావడంతో.. వాణిదేవి విజయం సాధించారు. మరోవైపు వాణిదేవి గెలుపుతో టీఆర్ఎస్‌లో సంబరాలు మొదలయ్యాయి.