ఇవాళ, మార్చి 13న టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా పలు ప్రాంతాల్లో అభిమానులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు వినూత్న శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న మహాబలేశ్వర ఆలయం వద్ద ఆత్మలింగం సమీపంలోని సముద్రంలో పది పడవలపై కవిత ఫోటోలతో కూడిన గులాబీ జెండాలను టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన చిన్ను గౌడ్ ప్రదర్శించి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు నిజామాబాద్ భూమారెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఓ వ్యక్తి 12 అడుగుల కవితా ఫొటోను 18 వేల నాణేలతో నేలపై అమర్చి 'హ్యాపీ బర్త్‌డే కవితక్క' అని రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అయితే చార్మినార్‌పై ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీని పెట్టిన టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. కాగా, శనివారం చార్మినార్‌పై టీఆర్‌ఎస్ మొగల్తూరు డివిజన్ అధ్యక్షుడు పుప్పాల రాధాకృష్ణ, మరో నాయకుడు మణికొండ విజయకుమార్‌తో కలిసి ఫ్లెక్సీని ఆవిష్కరించారు. దీన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఫ్లెక్సీని తొలగించారు. చార్మినార్ కన్జర్వేటర్ రాజేశ్వరి మాట్లాడుతూ.. చారిత్రక కట్టడంపై ఫ్లెక్సీలు పెట్టడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు ఇద్దరు నేతలపై కేసు నమోదు చేశారు.
కల్వకుంట్ల కవితకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తన ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.