ట్రీ ఐసోలేష‌న్ స‌క్సెస్‌.. క‌రోనాను జ‌యించిన శివ‌

Tree isolation success. కొత్తగా ఆలోచించిన శివ అనే యువ‌కుడు చెట్టునే ఆవాసంగా చేసుకుని క‌రోనాని జ‌యించాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 May 2021 11:51 AM IST
tree isolation

కరోనా మహమ్మారిని జయించడానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా పోరాడుతూ ఉన్నారు. కరోనా సోకగానే భయపడకుండా ఉండాలని పలువురు సూచిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. కరోనాను ధైర్యంగా ఎదుర్కొంటే విజయం సాధించవచ్చు. కరోనా సోకిన విషయం తెలుసుకోగానే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు దూరంగా ఐసోలేషన్ లో ఉండాలి. అలా చేస్తేనే మన కుటుంబ సభ్యులకు కూడా ఎంతో మంచి చేసిన వాళ్లమవుతాము. ఐసోలేషన్ అంటే ప్రత్యకంగా ఒక చోట ఉండడం.. కానీ అందరి ఇళ్లలోనూ ప్రత్యేకంగా గదులు వంటివి దొరకకపోవచ్చు. అలాంటి సమయంలోనే వేరే మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. అలా కొత్తగా ఆలోచించిన శివ అనే యువ‌కుడు చెట్టునే ఆవాసంగా చేసుకుని క‌రోనాని జ‌యించాడు.

న‌ల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండకు చెందిన శివకు కరోనా సోకింది. ఐసోలేషన్ లో ఉండాలని డాక్టర్లు చెప్పారు. పేదవాళ్ళు కావడం.. అతడి ఇంట్లో ఉన్నది ఒక్కటే రూము కావడంతో.. ఐసోలేషన్ లో ఎలా ఉండాలి అనే ప్రశ్న అతడిని వెంటాడింది. ఇంటి ముందున్న చెట్టు గుర్తుకు రావడంతో దాన్ని ఐసోలేషన్ రూమ్ గా మార్చుకున్నాడు. చెట్టుపై మంచం కట్టాడు. అక్క‌డే భోజ‌నం నిద్ర అన్నీ కానిచ్చేశాడు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో.. అధికారులు వెంట‌నే అత‌డిని మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన హోం ఐసోలేష‌న్ కేంద్రానికి త‌ర‌లించారు.

తాజాగా అత‌డికి నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో క‌రోనా నెగిటివ్‌గా వ‌చ్చింది. ఎంపీపీ బాలాజీ, సర్పంచి కొత్త మరెడ్డి, ఎస్సై వీరశేఖర్‌, మండల వైద్యాధికారి డాక్టర్‌ ఉపేందర్‌, వైస్‌ఎంపీపీ కూరాకుల మల్లేశ్వరి గోపీనాధ్‌ తదితరులు సోమవారం అతడిని కుటుంబసభ్యులకు అప్పగించారు. ట్రీ ఐసోలేషన్‌‌తో కరోనాను జయించిన అత‌డు ప్ర‌స్తుతం ఎంతో మందికి ఆద‌ర్శ‌నం.


Next Story