విషాదం.. అర్థరాత్రి చిన్నారిని కాటేసిన రెండు పాములు
బోసి నవ్వులతో, బుడి బుడి అడుగులతో కన్నవారి కళ్లల్లో ఆనందం నింపాల్సిన ఆ చిన్నారి.. అప్పుడే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
By అంజి Published on 30 July 2023 6:37 AM ISTవిషాదం.. అర్థరాత్రి చిన్నారిని కాటేసిన రెండు పాములు
రెండున్నరేళ్ల బాలుడికి అప్పుడే నూరేళ్లు నిండాయి. బోసి నవ్వులతో, బుడి బుడి అడుగులతో కన్నవారి కళ్లల్లో ఆనందం నింపాల్సిన ఆ చిన్నారి.. అప్పుడే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. రెండు పాములు ఆ చిన్నారి జీవితాన్ని బలి తీసుకున్నాయి. అప్పటివరకు చిన్నారి నవ్వులతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో.. ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి నిజామాబాద్ జిల్లా నవీపేట ఎస్సై యాదగిరిగౌడ్ పూర్తి వివరాలు తెలిపారు. నవీపేట మండలం బినోల గ్రామానికి చెందిన మంగలి భూమేశ్, హర్షిత దంపతులకు రెండున్నరేళ్ల బాబు, 3 నెలల కూతురు ఉన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వారి ఇంట్లోని ఓ గది కుప్పకూలింది. దీంతో శుక్రవారం నాడు తల్లిదండ్రులు పిల్లలతో కలిసి మరో గదిలో నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి టైమ్‌లో ఇంటిపై నుంచి రెండు పాములు ఒకేసారి మంచంపై నిద్రిస్తున్న రుద్రాన్ష్ మీద పడ్డాయి. చిన్నారి చేతికి చుట్టుకుని కాటేశాయి. చిన్నారి ఏడవడంతో లేచి చూచిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిన్నారిని చుట్టుకుని ఉన్న పాములను లాగి చంపేశారు. అనంతరం చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం చిన్నారి మృతి చెందాడు.
పాము కాటుకు చిన్నారి మృతిచెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.