రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
రేవంత్‌రెడ్డి రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
By Srikanth Gundamalla Published on 6 Dec 2023 4:23 PM ISTరేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. రేవంత్‌రెడ్డి సీఎంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. రేవంత్‌రెడ్డి రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకారోత్సావానికి ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ పెద్దలతో పాటు ఇతర ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. దాంతో.. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో రేపు ఆంక్షలు కొనసాగనున్నాయి.
తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లను ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, సీపీ సందీప్ శాండిల్య, జీహెఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ కలిసి పరిశీలించారు. ఈసందర్బంగా మాట్లాడిన డీజీపీ రవి గుప్తా.. సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. సీఎం ప్రమాణస్వీకారోత్సవం నేపథ్యంలో రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. దాదాపు లక్ష మంది సభకు హాజరు అయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో 30వేల మందికి కూర్చొనే సౌకర్యం ఉందన్నారు డీజీపీ. అయితే.. మిగతా జనం కోసం స్టేడియం బయట ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ రవిగుప్తా చెప్పారు.
ముఖ్యంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాదారులు ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు. ఎల్బీ స్టేడియం, లక్డీకాపూల్ సహా పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని డీజీపీ రవిగుప్తా చెప్పారు. మరోవైపు భద్రత ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా ఉన్నాయని డీజీపీ వెల్లడించారు.