పెండింగ్‌ ట్రాఫిక్ చలాన్లు కడుతున్నారా? అయితే జాగ్రత్త!

తెలంగాణలో ట్రాఫిక్ పెండింగ్‌ చలాన్లు భారీగా పేరుకుపోయాయి.

By Srikanth Gundamalla  Published on  2 Jan 2024 11:31 AM IST
traffic, pending challan, fake website, telangana,

 పెండింగ్‌ ట్రాఫిక్ చలాన్లు కడుతున్నారా? అయితే జాగ్రత్త!

తెలంగాణలో ట్రాఫిక్ పెండింగ్‌ చలాన్లు భారీగా పేరుకుపోయాయి. గతంలో ఇలాంటి పెండింగ్‌ చలాన్లపై రాయితీలు ప్రకటిచండంతో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ మేరకు రాయితీల ద్వార వందల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించింది. గతంతో పోలిస్తే ఈసారి ఇంకాస్త ఎక్కువే రాయితీలు ఇచ్చింది. దాంతో.. పెండింగ్‌ చలాన్లు కట్టాల్సిన వాహనదారులు పెద్ద ఎత్తున వారి చలాన్లను కట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అవకాశంగా భావించిన సైబర్‌ నేరగాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్యాష్ చేసుకుంటున్నారు.

కొందరు సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లను క్రియేట్ చేసి వాహనదారుల అకౌంట్ల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు. 2 కోట్లకు పైగా పెండింగ్‌ చలాన్లు మిగిలి పోవడంతో రాష్ట్ర పోలీస్‌ శాఖ ఇటీవల రాయితీని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించారు. ఈనేపథ్యంలో ఈ ఆఫర్‌కు వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఒక్కసారిగా అందరూ చలన్ల కట్టేందుకు ఆన్‌లైన్‌లోకి వస్తుండటంతో సైట్‌ కూడా మొరాయిస్తోంది. ఇదే అవకాశంగా మలుచుకున్నారు సైబర్ నేరగాళ్లు. నకిలీ వెబ్‌సైట్లను క్రియేట్‌ చేశారు. https ://echallantspolice.in/ అన్న పేరుతో నకిలీ వెబ్ సైట్‌ను రూపొందించారు. దీని ద్వారా చలాన్లు వసూలు చేస్తూ వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.

ఈ విషయం తెలంగాణ పోలీస్ శాఖ దృష్టికి కూడా వచ్చింది. దాంతో స్పందించిన పోలీసులు వాహనదారులను హెచ్చరిస్తున్నారు. ఆఫర్లలో చలాన్లు కట్టేందుకు మీ సేవా సెంటర్లతో పాటు https://echallan.tspolice.gov.in/publicview వెబ్ సైట్‌ల ద్వారా చలానాలు కట్టాలని సూచిస్తున్నారు. అయితే.. ఒక్కసారిగా అందరూ చలాన్లు కట్టేందుకు సైట్‌ను ఉపయోగిస్తుండటంతో కొన్నిసార్లు హ్యాంగ్ అవుతోందని.. అందుకుని వేర్వేరు వాటిల్లో డబ్బులు కట్టేసి మోసపోవద్దని సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారనీ.. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. నకిలీ వెబ్‌సైట్లలో డబ్బులు కట్టి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. అయితే..నకిలీ వెబ్‌సైట్లను తీసుకొచ్చిన వారిని గుర్తించే పనిలో పడ్డామనీ.. త్వరలోనే వాటిని తొలగిస్తామని చెబుతున్నారు. అంతవరకు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.





Next Story