అదానీని అప్పుడే అరెస్టు చేసుంటే దేశం పరువు పోయేది కాదు

నరేంద్ర మోదీ అండదండలతో అదానీ దేశంలోని వ్యవస్థలకు ‘నమో అదానీ’గా మారారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

By Medi Samrat  Published on  18 Dec 2024 2:43 PM IST
అదానీని అప్పుడే అరెస్టు చేసుంటే దేశం పరువు పోయేది కాదు

నరేంద్ర మోదీ అండదండలతో అదానీ దేశంలోని వ్యవస్థలకు ‘నమో అదానీ’గా మారారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజ్ భవన్ వద్ద ఆయ‌న మాట్లాడుతూ.. అదానీ కుంభకోణాలపై ఎన్డీఏ ప్రభుత్వం జేపీసీ వేయడానికి ఎందుకు జంకుతుంది? అవినీతి రహిత పాలనపై సొంతడబ్బా కొట్టుకునే మోదీ ప్రభుత్వం అదానీ అవినీతిపై పార్లమెంట్‌లో చర్చకు ఎందుకు జంకుతుంది? అని ప్ర‌శ్నించారు.

అదానీపై ప్రభుత్వ సంస్థలు మౌనం దాల్చడానికి మోదీ అండదండలు ఉన్నాయ‌న్నది వాస్తవం అన్నారు. అదానీ ఎన్నో కుంభకోణాలకు పాల్పడుతున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది.. నరేంద్ర మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పటి నుండే అదానీతో సత్సంబంధాలున్నాయన్నారు. అదానీ స్కాములను అమెరికా ఏజెన్సీలు బయటపెట్టాయి.. అరెస్టు వారెంటు జారీ చేశాయి.. అదానీ స్కాములతో దేశ ప్రతిష్ట మసకబారుతోందన్నారు.

అదానీ అవినీతిని మొదట్లోనే అరికట్టి అరెస్టు చేసుంటే అంతర్జాతీయంగా దేశం పరువు పోయేది కాదన్నారు. దేశంలో అదానీ చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాల్లో 65 మిలియన్‌ డాలర్లు (రూ.2,029 కోట్లు) కుంభకోణం జరిగినట్టు అమెరికా విచారణ సంస్థలు తేల్చాయి.. సామాన్యులు, రైతులు రుణాలు చెల్లించడం ఆలస్యమైతే ఆస్తులను జప్తు చేసే ప్రభుత్వం అదానీ విషయంలో ఉదాసీన వైఖరి ఎందుకు? బ్యాంకింగ్‌ వ్యవస్థలను అదానీ స్కాంలతో లక్షల కోట్ల రూపాయలను ఎగ్గొట్టుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నాయి? అని ప్ర‌శ్నించారు.

గుజరాత్‌ అల్లర్ల సమయంలో యావత్‌ దేశం మోదీని తప్పుపడితే అదానీ మాత్రం ఆయనను సమర్థించారు. 2014 పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ ప్రచారానికి అదానీ విమానాన్ని వాడుకున్నారు. మోదీ ప్రమాణస్వీకారానికి అదానీ విమానంలోనే ఢిల్లీకి వచ్చారన్నారు. 2014 నాటికి అదానీ కంపెనీల టర్నోవర్‌ రూ.75,659 కోట్లు కాగా, ఇప్పుడు రూ.1,78,946 కోట్లకు పెరిగింది. 2017లో దేశంలో బొగ్గు కొరతకు అదానీ కంపెనీయే ప్రధాన కారణం అన్నారు. అదానీ స్టాక్‌ మార్కెట్లో రూ.8 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. దీనిపై హిండెన్‌బర్గ్‌ నివేదిక ఇచ్చినా మోదీ ప్రభుత్వం షరామాములుగానే పట్టించుకోలేదన్నారు. 2013లో అదానీ అక్రమాలకు పాల్పడితే అప్పటి యూపీఏ ప్రభుత్వం రూ.200 కోట్ల పెనాల్టీ విధిస్తే నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేశారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎం, మంత్రులు ఇతర నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ ఏజెన్సీలను ఉసిగొల్పే కేంద్ర ప్రభుత్వం అదానీ విషయంలో మాత్రం చోద్యం చూస్తోందన్నారు.

ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్న అదానీని అరెస్టు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం విషయాన్ని పక్కదారి పట్టిస్తుంది. నరేంద్ర మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పటి నుండే అదానీతో సత్సంబంధాలున్నాయి. అదానీ అప్పుడు సమర్థించినందుకు ఇప్పుడు ఆ రుణాన్ని తీర్చుకోవడానికి నరేంద్రమోదీ అధికారంలోకి రాగానే అదానీ ఎదుగుదలకు శాయశక్తులా తోడ్పాటు అందిస్తున్నారు. జాతి వివక్షతతో మణిపూర్‌ రాష్ట్రం తగలబడుతున్నా ఎన్డీయే ప్రభుత్వం మౌనం దాల్చింది. కనీసం ఒక్కసారి కూడా ప్రధాని మోదీ మణిపూర్‌లో పర్యటించలేదు. మణిపూర్‌లో అపోహలతో గొడవపడుతున్న వర్గాలతో కనీసం చర్చలు జరిపేందుకు కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. మణిపూర్ శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో బీజేపీ ప్రభుత్వం విఫలమయింది. కనీసం అక్కడ సీఎంను కూడా మార్చలేకపోతుందని విమ‌ర్శించారు.

Next Story