తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

TPCC Chief Revanth Reddy's open letter to the Telangana community. తెలంగాణ సమాజానికి రాష్ట్ర పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

By అంజి  Published on  31 Oct 2022 7:36 AM GMT
తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

తెలంగాణ సమాజానికి రాష్ట్ర పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలన ఫాంహౌస్‌కే పరిమితమైందన్నారు. ''ఎనిమిదేళ్లుగా బీజేపీ అరాచకాలకు టీఆర్‌ఎస్‌ అండగా నిలిచింది. కేంద్రం తీసుకొచ్చిన బ్లాక్‌ ఫార్మ్‌ చట్టాలను టీఆర్‌ఎస్‌ సమర్థించింది. ప్రజాస్వామ్య సంస్థల విధ్వంసానికి అంతు లేదు. సంక్షేమ పథకాల పేరుతో అడ్డూఅదుపూ లేకుండా దోపిడీకి పాల్పడుతున్నారు. రైతు రుణమాఫీ హామీ అమలు కాలేదు. రైతుల ఆత్మహత్యలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఉచిత ఎరువుల హామీని తుంగలో తొక్కారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి సుదూర కలగా మిగిలిపోయింది, అయితే హామీ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు నిరవధికంగా ఖాళీలుగా కొనసాగుతున్నాయి. పోడు భూములకు భూమి హక్కు అనేది బూటకపు హామీగా మిగిలిపోయింది. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అవినీతి ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతోంది. భూ కుంభకోణాలు, అక్రమ ఆక్రమణలకు అంతులేదు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో పురోగతి లేదు. ప్రభుత్వ విద్యావ్యవస్థ పూర్తిగా ధ్వంసమై ఉచిత వైద్యం ఎండమావిగా మిగిలిపోయింది.'' అంటూ రేవంత్‌ లేఖలో పేర్కొన్నారు.

''భారత్ గత ఎనిమిదేళ్లుగా నిర్బంధంలో ఉంది. భావ ప్రకటనా స్వేచ్ఛ మాత్రమే కాదు, జీవన స్వేచ్ఛ కూడా అంతరించిపోయింది. ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే దేశద్రోహులుగా ముద్ర వేస్తారు. నాయకుల తప్పులను ఎత్తి చూపడం నేరం. బ్రిటీష్ విభజించి పాలించు విధానాన్ని బిజెపి పునరుద్ధరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రూపాయి పతనమైంది. 22 కోట్ల మంది యువత ఉపాధి లేక జీవనోపాధి లేకుండా నిర్వీర్యమయ్యారు. చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసరాల ధరలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఆకలి సూచీలో మన దేశం 107వ స్థానానికి పడిపోయింది.'' అని రేవంత్‌ అన్నారు.

ఈ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాల కోసం ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. దేశం యొక్క దుస్థితిని ప్రశ్నిస్తూ.. అణచివేత సంకెళ్లను బద్దలు కొడుతూ.. దేశాన్ని ఏకం చేస్తూ రాహుల్ గాంధీ "భారత్ జోడో" మార్చ్‌కు బయలుదేరారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో వేసిన తొలి అడుగు రాష్ట్రాలు దాటి అక్టోబర్ 23న తెలంగాణలోకి ప్రవేశించింది. ఈ మానవతా నాయకుడికి అడుగడుగునా తెలంగాణ ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. "భారత్ జోడో యాత్ర" ఆగని కెరటం నవంబర్ 1 న చారిత్రక హైదరాబాద్ నగరంలోకి ప్రవేశిస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు చార్మినార్‌ నుంచి బయలుదేరి 5 గంటలకు నెక్లెస్‌ రోడ్డులోని మహా బహిరంగ సభకు చేరుకుంటుంది.

ఈ మహత్తర సందర్భంలో చరిత్రను స్మరించుకుందాం. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగిన జ్ఞాపకాలు మరువలేనివి. నగరం సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ, కాంగ్రెస్ దాని అభివృద్ధికి కొత్త బాటలు వేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ రంగాలలో హైదరాబాద్ ఖ్యాతిని విస్తరించడంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించింది. దివంగత నాయకుడు రాజీవ్ గాంధీ భారతదేశాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలోకి నడిపించారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఏర్పాటుతో హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దడంలో కాంగ్రెస్‌ కృషిని ఎవరూ తుడిచిపెట్టలేరు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన విజయానికి, ఆర్థిక స్థిరత్వానికి హైదరాబాద్ కారణం. అలాంటి హైదరాబాద్‌ను కానుకగా ఇచ్చింది కాంగ్రెస్సే. మనం కలలు కన్న తెలంగాణను అందించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇక్కడకు రాబోతున్నారు. ఈ సందర్భంగా మన గత స్మృతులను గుర్తు చేసుకుంటూ మన జాతి ఉజ్వల భవిష్యత్తు కోసం ఆయనకు తోడ్పాటునందిద్దాం. ఐక్యత కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలో చేరుదాం. రాజకీయ విశ్వాసాలను పక్కనబెట్టి అందరం కలిసి ఆయనతో చేతులు కలుపుదాం. కనీసం ఒక కిలోమీటరు పాటు కలిసి నడిచి జాతీయ ఐక్యత మన అత్యంత ప్రాధాన్యత అని నిరూపిద్దాం.

''మీ రాజకీయ ఒరవడితో సంబంధం లేకుండా మీరు మాతో చేరతారని ఆశిస్తూ.. భారతమాత కోసం రాహుల్‌తో చేతులు కలుపుతారనే నమ్మకంతో.. నవంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు చార్మినార్‌లో కలుద్దాం.'' అని తెలంగాణ ప్రజలకు రేవంత్‌ లేఖ రాశారు.

Next Story