'కేసీఆర్ మళ్లీ వంచించే ప్రయత్నం చేశారు'
TPCC Chief Revanth reddy comments on CM KCR. సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. నిన్న జరిగిన ప్రజా దీవెన సభలో మునుగోడు ప్రజలను
By అంజి
సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. నిన్న జరిగిన ప్రజా దీవెన సభలో మునుగోడు ప్రజలను కేసీఆర్ మరోసారి మోసం చేశారని రేవంత్ ఆరోపించారు. సభలో మునుగోడు సమస్యలను ప్రస్తావించలేదన్నారు. నిరుద్యోగ యువకులకు ఏ రకంగా ఉపాధి కల్పిస్తారో కూడా చెప్పలేదన్నారు. మునుగోడులో నిన్న జరిగిన సభలో ఉపాధి, ప్రాజెక్టులపై మాట్లాడని కేసీఆర్.. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై మాట్లాడి.. మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేశారని రేవంత్ మండిపడ్డారు.
ఇవాళ పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్లోని గాంధీభవన్లో రేవంత్రెడ్డి మాట్లాడారు. నిన్నటి సభలో మునుగోడుకు కేసీఆర్ ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పలేదన్నారు. కేసీఆర్‌కు కోట్ల రూపాయలు రాజగోపాల్‌రెడ్డి సహాయం చేసినట్లు చెప్పారని, ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటని రేవంత్ ప్రశ్నించారు. ఎందుకు సహాయం చెప్పారో ప్రజలకు చెప్పాలన్నారు. ఆ కోట్ల రూపాయల డబ్బులను రాజగోపాల్‌రెడ్డి ఇన్‌కమ్ ట్యాక్స్ లెక్కల్లో చూపెట్టారా? అని ప్రశ్నించారు. రాజగోపాల్ చేసిన ఆరోపణలపై కేసీఆర్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని రేవంత్ అన్నారు.
పోడు భూముల సమస్యను ఎలా తీరుస్తారో చెప్పని కేసీఆర్.. కనీసం ఎప్పటిలోగా డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తారో కూడా చెప్పలేదన్నారు. సభలో చర్లగూడెం, కిస్టరాయపల్లి భూ నిర్వాసితుల సమస్యను ప్రస్తావించలేదన్నారు. కేసీఆర్.. ఈడీ, సీబీఐల మీద మాట్లాడారని, పార్టీ ఫిరాయింపులకు ఆద్యులు ఆయనేనన్నారు. బీజేపీకి కేసీఆర్ ఆదర్శమని, పార్టీల విలీనానికి కిటికీలు తెరిచింది కేసీఆరే అని అన్నారు. ఏకలింగంగా ఉన్న బీజేపీని మూడు తోకలు చేసింది.. కేసీఆరే అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణపై బీజేపీ ముప్పేట దాడికి కేసీఆరే కారణమని రేవంత్ అన్నారు.