Tollywood drugs case: ఆరు కేసులను కొట్టివేసిన న్యాయస్థానం

తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  1 Feb 2024 12:17 PM GMT
tollywood drugs case, nampally court , hyderabad,

Tollywood drugs case: ఆరు కేసులను కొట్టివేసిన న్యాయస్థానం

తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్‌ తీసుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఈ కేసులో తాజాగా కీలక ములపు చోటుచేసుకుంది. 2017లో నమోదైన కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

తెలుగు సినీ పరిశ్రమలో పలువురు డ్రగ్స్‌ తీసుకున్నారన్న వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందం (సిట్ట్)ను ఏర్పాటు చేసింది. పూరీ జగన్నాథ్‌, చార్మీ, తరుణ్‌, నవదీప్‌, రవితేజ, శ్యామ్‌ కె నాయుడు, ముమైత్‌ ఖాన్‌, తనీష్‌ సహా పలువురిపై డ్రగ్స్‌ కేసు నమోదు చేశారు. మొత్తం 12 కేసులు నమోదు చేసింది సిట్‌. వీటిల్లో 8 కేసుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయగా.. వాటిలో ఆరు కేసులకు సంబంధించి సరైన ఆధారాలు లేవని కోర్టు కొట్టివేసింది. డ్రగ్స్‌ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని.. ఆరు కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవని నాంపల్లి కోర్టు వెల్లడించింది.

డ్రగ్స్‌ కేసులో ఉన్నవారిని పలుమార్లు విచారించారు. అయినా ఫలితం లేకపోయింది. వారి నుంచి వెంట్రుకలు, గోళ్ల శాంపిల్స్‌ను సేకరించారు. అయితే..వారిలో నుంచి కేవలం పూరీ జగన్నాథ్, తరుణ్‌ శాంపిళ్లను మాత్రమే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. అక్కడ ఈ ఇద్దరి శరీరంలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ధృవీకరించారు. ఇక అన్ని రిపోర్టులను పరిశీలించిన నాంపల్లి కోర్టు ఎనిమిది కేసుల్లో ఆరింటిని కొట్టివేసింది.

Next Story