తెలంగాణ మహిళా యూనివర్సిటీకి.. చాకలి ఐలమ్మ పేరు: సీఎం రేవంత్‌

హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.

By అంజి  Published on  11 Sept 2024 7:24 AM IST
Telangana Womens University, chakali ilamma , CM Revanth

తెలంగాణ మహిళా యూనివర్సిటీకి.. చాకలి ఐలమ్మ పేరు: సీఎం రేవంత్‌

హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. చాకలి ఐలమ్మ 39 వ వర్థంతిని పురస్కరించుకుని ప్రభుత్వం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలో ధీర వనిత ఐలమ్మ స్పూర్తిని కొనసాగిస్తామన్నారు. పోరాటయోధురాలిని స్మరిస్తూ ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఐలమ్మ కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని భావిస్తున్నట్టు తెలిపారు.

దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాలను పేదలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేశారంటూ వారిని స్మరించుకున్నారు. ఐలమ్మ స్పూర్తితో ఇందిరా గాంధీ దేశంలో భూ సంస్కరణలు తెచ్చారని, భూమి పేదవాడి ఆత్మగౌరవం, అందుకే ఇందిరమ్మ పేదలకు లక్షల ఎకరాలను పంచిపెట్టారని అన్నారు. ధరణి ముసుగులో కొందరు పేదల భూములను కాజేయాలన్న కుట్ర చేశారని, పేదల భూములను కాపాడేందుకే ఐలమ్మ స్పూర్తితో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

Next Story