నాగోబా జాతరకు వేళాయె.. గంగాజల యాత్ర గురించి మీకు తెలుసా?
తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ గిరిజన ధార్మిక కార్యక్రమాలలో ఒకటి కేస్లాపూర్ నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ప్రతి సంవత్సరం పుష్య అమావాస్య రోజున నాగోబా జాతర మొదలవుతుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Jan 2025 1:45 PM ISTనాగోబా జాతరకు వేళాయె.. గంగాజల యాత్ర గురించి మీకు తెలుసా?
తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ గిరిజన ధార్మిక కార్యక్రమాలలో ఒకటి కేస్లాపూర్ నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ప్రతి సంవత్సరం పుష్య అమావాస్య రోజున నాగోబా జాతర మొదలవుతుంది. అమావాస్య అర్ధరాత్రి వేళ చిమ్మ చీకట్లో గిరిజనులంతా కలిసి వెలుగు కోసం అన్వేషిస్తారు. తమ జీవితాల్లో వెలుగులు నింపాలని నాగదేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు.
ఈ ఏడాది జనవరి 28న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం కానుంది. జనవరి 10వ తేదీన మెస్రం వంశీయులు పాదరక్షలు విడిచి గంగాజల్ యాత్రను ప్రారంభించారు. జాతర సన్నాహాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గంగాజల యాత్రలో భాగంగా మెస్రం వంశ ప్రజలు గోదావరి నది నుండి పవిత్ర జలాన్ని తీసుకురావడానికి 100 కి.మీ నుండి 200 కి.మీ వరకు నడక సాగిస్తారు. దట్టమైన అడవులు, వ్యవసాయ క్షేత్రాలు, కొండ ప్రాంతాల గుండా సాగే ఈ ప్రయాణంలో చెప్పులు లేకుండా ప్రయాణం సాగిస్తారు. ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలనుకునే భక్తులు మాత్రమే ఈ ప్రయాణంలో భాగమవుతారు.
ఈ సంవత్సరం, దాదాపు 130 మంది ఔత్సాహికులు గంగాజల యాత్రలో చేరారు. జనవరి 17న మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులో గోదావరిలోని హస్తినమడుగు ప్రాంతానికి ఈ బృందం చేరుకుంటుంది. గంగాజల్ యాత్రలో పలు సంస్కరణలను చేశారు. ఈ మార్పులలో భాగంగా విద్యార్థులను యాత్రలో భాగం చేయడం లేదు, యాత్ర చేసే వ్యక్తులు సాంప్రదాయ ధోతీ-కుర్తా ధరించాలి, ఈ ప్రయాణంలో పాల్గొనేవారు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడాన్ని నిషేధించారు.
"విద్యార్థులను ఈ యాత్రలో పాల్గొనడానికి అనుమతించడం లేదు, ఎందుకంటే వారు తరగతులకు హాజరు కాకపోవడం వలన చదువులు దెబ్బతింటాయి," అని ఈ సమూహం పెద్ద, గిరిజన విద్యావేత్త మెస్రం మనోహర్ తెలిపారు. ఆదివాసీ విద్యార్థులు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల స్కూళ్లకు గైర్హాజరు అవ్వడంతో పూర్వపు ఆదిలాబాద్‌లోని ఆదివాసీల్లో డ్రాపౌట్ నిష్పత్తి ఎక్కువగా ఉంది.
ఆదివాసీల అకడమిక్ క్యాలెండర్‌ను సవరించాలని కేస్లాపూర్ పటేల్ మెస్రం వెంకట్‌రావు, ప్రధాన అర్చకులు మెస్రం కోసెరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన పండుగల ప్రకారం విద్యార్థులకు సెలవులు లభిస్తే డ్రాపౌట్ రేటును నియంత్రించవచ్చని తెలిపారు.
గంగాజల యాత్రలో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించడం పట్ల పాదయాత్రకు నాయకత్వం వహిస్తున్న ప్రధాన అర్చకుడు మెస్రం దాదారావు హర్షం వ్యక్తం చేశారు. యాత్రను సంపూర్ణ దైవభక్తితో చేయాలని తెలిపారు. "యాత్రకు సంబంధించి అప్పుడప్పుడు ఆపినప్పుడల్లా యువకులు సోషల్ మీడియాను ఉపయోగించడం చేస్తూ వస్తున్నారు. ఇది వారి మనస్సు ను వేరే వైపు మళ్ళిస్తుంది. యాత్ర వెనుక ఉన్న గొప్పతనాన్ని దెబ్బతీస్తుంది," అన్నారాయన.
పుష్యమాసంలో వచ్చే అమావాస్య అర్థరాత్రి నుంచి నాగోబా జాతర మొదలవుతుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుంది. నాగోబా జాతరలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. మెస్రం వంశీయులు ప్రత్యేకమైన కుండలలో తీసుకొచ్చిన గోదావరి నదీ జలాలతో నాగేంద్రుడికి అభిషేకం చేస్తారు. అమావాస్య రోజు రాత్రి నాగేంద్రుడు నాట్యం చేస్తాడని గిరిజనుల నమ్మకం.