మంచిర్యాల జిల్లాలోని ఈ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గురించి తెలుసా?
తెలంగాణలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి వాటిలో మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం శివ్వారం గ్రామంలోని మొసళ్ల అభయారణ్యం ఒకటి.
By అంజి Published on 20 Aug 2023 5:00 AM GMTమంచిర్యాల జిల్లాలోని ఈ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గురించి తెలుసా?
మంచిర్యాల: ఉరుకుల పరుగుల జీవితంలో మానవుడు కాలంతో కలిసి పరుగెడుతున్న రోజులివి. ఇలాంటి పరిస్థితుల్లో అందమైన ప్రకృతి, ఆకర్షించే వాతావరణం కోరుకునే వ్యక్తులకు తెలంగాణలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి వాటిలో మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం శివ్వారం గ్రామంలోని మొసళ్ల అభయారణ్యం ఒకటి. ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను ఎంతగానో ఆహ్లాదపరుస్తుంది. ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. 1978లో మంచినీటి లేదా చిత్తడి మొసళ్ల సంరక్షణ కోసం స్థాపించబడిన ఈ అభయారణ్యం జిల్లాలోని ప్రధాన పర్యాటక ప్రదేశం.
ఇది రాష్ట్ర అటవీ శాఖచే నిర్వహించబడుతుంది.ఇక్కడ మార్ష్‌జాతికి చెందిన మొసళ్లు నివసిస్తాయి. వీటినే మగ్గర్ మొసళ్లు అని కుడా అంటారు. ఇవి ఎక్కువ పారుదల ఉండే స్వచ్ఛమైన నీటిలో, భూమిపైనా నివసించగలవు. చాలా కాలం క్రితం రూపొందించిన ఈ స్థలాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు ఇప్పుడు పునరుద్ధరించబడ్డాయి. బోటింగ్ సౌకర్యం కూడా ఇటీవల పునరుద్ధరించబడింది. అభయారణ్యం యొక్క ఫేస్‌లిఫ్టింగ్ పని వేసవిలో ప్రారంభమైంది. కొన్ని వారాల క్రితమే బోట్ రైడ్ సౌకర్యం పునరుద్ధరించబడింది. లైఫ్ జాకెట్లు ఏర్పాటు చేశారు. జెట్టీ, ఇతర నిర్మాణాలకు మరమ్మతులు చేశారు.
అభయారణ్యంలో గైడెడ్ టూర్ అందించడానికి ట్రెక్ మార్గం అభివృద్ధి చేయబడింది. పర్యాటకుల సౌకర్యార్థం ఇంటరాక్టివ్ సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు సాయంత్రం పూట రైడ్ చేయవచ్చు. ఛార్జీలు నామమాత్రంగానే ఉంటాయి. అలాగే ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు, చెట్లు, జీవజాతులు, గుహలను కలుపుతూ ఉండే ప్రాంతం ట్రెక్కింగ్ ఎంతో బాగుంటుంది. దారి పొడవునా అరుదైన వృక్షాలు, దానికి సంబంధించిన వివరాలు, అక్కడ ఉండే జీవజాతుల గురించి తెలిపే సైన్ బోర్టులు ఉన్నాయి. సేద తీరడానికి రెస్ట్ షెల్టర్, ప్రకృతిని ఆస్వాదించడానికి వాచ్‌టవర్‌లు ఉంటాయి.
ఎలా చేరుకోవాలి
పౌనూరు వరకు డబుల్ లేన్ రోడ్డు ఉన్న ఇందారం-శివ్వరం మార్గంలో మంచిర్యాల పట్టణం నుండి సులభంగా అభయారణ్యం చేరుకోవచ్చు. లేకుంటే, సందర్శకులు చెన్నూర్-అస్నాద్-సోమన్‌పల్లి మార్గంలో గ్రామాన్ని కనుగొనవచ్చు. ఇది మంచిర్యాల జిల్లా కేంద్రానికి 40 కి.మీ దూరంలో ఉంది.