మందుబాబులకు గుడ్‌న్యూస్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 12 Jan 2025 6:15 AM IST
మందుబాబులకు గుడ్‌న్యూస్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులను తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి, కనీసం నెల రోజుల నిర్ణీత గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో నిబంధనలకు అనుగుణంగా ఉండాలని అన్నారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సమీక్షించారు.
ఇప్పటికే తెలంగాణ బివరేజెస్ కార్పొరేషన్ కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ఆయా కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని, కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరగాలని చెప్పారు. ఇటీవల యునైటెడ్ బేవరేజస్ కంపెనీ బీర్ల రేట్లను 33.1 శాతం పెంచాలని ఒత్తిడి చేసిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదు. మద్యం ధరలు పెంచే ప్రసక్తే లేదు. పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీర్ల ధరలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.
హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ (ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ) నివేదిక ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఏడాదిగా ఎక్సైజ్ శాఖ ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తుండగా, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను క్రమంగా క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.