కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని కొండగట్టు ఆలయంలో చోరీ కలకలం రేపింది.
By అంజి
కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని కొండగట్టు ఆలయంలో చోరీ కలకలం రేపింది. ఆలయంలో రెండు విగ్రహాలు చోరీకి గురయ్యాయి. చోరీపై ఆలయ సిబ్బంది, అర్చకులు గమనించి శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆలయంలో విచారణ చేపట్టగా.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో సుమారు 15 కిలోల వెండి బంగారు నగలు మాయమైనట్లు గుర్తించారు. ప్రధాన ఆలయం వెనుక వైపున ఉన్న బేతాళ ఆలయ ప్రాంతం నుంచి ముగ్గురు వ్యక్తులు ప్రధాన ఆలయంలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు.
అర్ధరాత్రి స్వామి వారి పవళింపు సేవ ముగిసిన తరువాత ఆలయ అర్చకులు ప్రధాన ద్వారానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. తిరిగి ఉదయం ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ చేసేందుకు గుడికి వెళ్లిన అర్చకులు ప్రధాన ద్వారం నుండి దొంగలు చొరబడినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలు వేలిముద్రలు సేకరిస్తుండగా దొంగల ఆచూకీ కోసం డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. మల్యాల సీఐ కొండగట్టుకు చేరుకుని చోరీపై దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.
చోరీకి గురైన వెండి వస్తువుల వివరాల్లో 2 కిలోల వెండి మకర తోరణం, అర్ధ మండపంలోని ఆంజనేయస్వామి 5 కిలోల వెండి ఫ్రేమ్, 3 కిలోల వెండి శెటగోపాలు నాలుగు, స్వామివారి 5 కిలోల వెండి తొడుగు చోరీకి గురయ్యాయి. రూ.9 లక్షల విలువైన సుమారు 15 కిలోల వెండి చోరీకి గురైంది.