ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. ప్రయాణికులకు అనుమానం రాకుండా..

ఓ దొంగ.. ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు. బస్సులో ప్రయాణికులు కూడా ఉన్నారు. డ్రైవర్‌ మాదిరిగా నటిస్తూ ప్రయాణికులను ఎక్కించుకున్నాడు.

By అంజి  Published on  12 Sept 2023 8:43 AM IST
thief hijacked RTC bus, Siddipet depot, Rajanna sirisilla

 ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. ప్రయాణికులకు అనుమానం రాకుండా..

ఓ దొంగ.. ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు. బస్సులో ప్రయాణికులు కూడా ఉన్నారు. డ్రైవర్‌ మాదిరిగా నటిస్తూ ప్రయాణికులను ఎక్కించుకున్నాడు దొంగ. అయితే మార్గం మధ్యలో బస్సులో డీజిల్‌ అయిపోయింది. దీంతో బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటన సోమవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన స్వామి తన బస్సును సిద్దిపేట - హైదరాబాద్‌కు ఆర్టీసీలో అద్దెకు నడిపిస్తున్నాడు. ఆ బస్సు డ్రైవర్‌ ఆదివారం నాడు రాత్రి ఎంపీడీవో ఆఫీసు ముందు బస్సును పార్కింగ్‌ చేసి డోర్‌కు లాక్‌ వేయకుండా వెళ్లిపోయాడు. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం శ్రీగాదకు చెందిన బందెల రాజు.. బస్సును దొంగిలించి వేములవాడకు తీసుకెళ్లాడు.

నిన్న ఉదయం పలువురు ప్రయాణికులను సిద్దిపేటకు తీసుకెళ్తానని ఎక్కించుకున్నాడు. టికెట్‌ తరువాత ఇస్తానని చెప్పి వారి దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఆర్టీసీ బస్సు కావడంతో ఎవరూ కూడా అనుమానం వ్యక్తం చేయలేదు. ఈ క్రమంలో తంగళ్లపల్లి మండలం సారంపల్లి- నేరెళ్ల రహదారి మధ్యలో బస్సు ఆగిపోయింది. దీంతో దొంగ డ్రైవర్‌.. ప్రయాణికులకు డీజిల్‌ అయిపోయింది, తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి చెక్కేశాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వారంతా ఇతర వాహనాల్లో వారి వారి గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ బస్సు రోడ్డు పక్కన ఉండటాన్ని గమనించి తమ కంట్రోలర్‌కు ఫోన్‌ చేశారు. ఆయన యజమాని స్వామికి సమాచారం అందించగా.. వెళ్లి బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సిద్దిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు రాజును గుర్తించి పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.

Next Story