కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సొంత గ్రామం సర్వాయిపేట గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు టూరిజం నుండి మొదటి దశలో రూ.4.70 కోట్లు మంజూరు చేసింది. సర్వాయిపేట్ కోట అభివృద్ధి తో పాటు సర్వాయి పేట్ నుండి కిలాష్ పూర్ కోట వరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నడయాడిన ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు రూ.4.70 కోట్ల విడుదలకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
సర్వాయి పాపన్న గౌడ్ నడియాడిన ప్రాంతాలను టూరిజంగా అభివృద్ధి చేసుకుంటే దేశ విదేశాలకు కూడా ఆయన జీవిత చరిత్ర తెలుస్తుందని మంత్రి పొన్నం అన్నారు. నేటి యువతకు సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర స్ఫూర్తి దాయకంగా ఉంటూ ఆ ప్రాంతాలు టూరిజంగా మరింత అభివృద్ధి చెందుతాయని మంత్రి పొన్నం ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ శాఖ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 374 వ జయంతి వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం, ఇతర నేతలు పాల్గొనడం జరిగింది.