తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దేశ చరిత్రలోనే ఒక కీలక ఘట్టమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యోగాలు రాలేదని ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, రాష్ట్ర ఆవిర్భావం కోసం విద్యార్థులు ఉద్యమం చేశారన్నారు. ఒకప్పుడు తెలంగాణ భాష మాట్లాడితే జోకర్‌లాగా చూసేవారని, ఇప్పుడు అదే భాష మాట్లాడితే హీరోలు అవుతున్నారని అన్నారు. ఇతర పార్టీలకు రాజకీయాలు ఒక గేమ్ కావచ్చు. కానీ మా పార్టీకి రాజకీయాలు ఓ టాస్క్ అన్నారు.
నీళ్లు, నియామకాలు, నిధులే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం సాగిందని, ఇప్పుడు అడ్డం, పొడవు మాట్లాడుతున్న కొందరు గతంలో ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కొట్లాడి నీళ్ల సమస్యను పరిష్కరించుకున్నామని, తెలంగాణ, ఏపీ సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటి వరకు 1.50 లక్షల ఉద్యోగాలు నోటిఫై చేయగా.. అందులో 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మరో 22 వేల ఉద్యోగాలు నియామక ప్రక్రియలో ఉన్నాయన్నారు. 95 శాతం లోకల్ కోటా, కేవలం 5 శాతం మాత్రమే ఓపెన్ కోటా కింద ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు.